అనారోగ్యంతో ఛత్తీస్గఢ్ అడవుల్లో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టు పార్టీ అగ్ర నేత అర్కే అంత్యక్రియలు నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు ముగిశాయి. ఆర్కే అంత్యక్రియలకు సంబంధించిన ఫొటోలను తాజాగా మావోయిస్టులు విడుదల చేశారు.
తెలంగాణకు సమీపంలోని పామేడు-కొండపల్లి సరిహద్దు ప్రాంతాల్లో ఆర్కే అంత్యక్రియలు జరిగినట్లు మావోయిస్టు పార్టీ తెలిపింది. ఆర్కే అంత్యక్రియలకు మావోయిస్టులు భారీ సంఖ్యలో హాజరయ్యారని, ఆయన భౌతిక కాయంపై ఎర్ర జెండా ఉంచి నివాళులు అర్పించామని వెల్లడించింది.
ఆర్కే దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా మావోయిస్టు ఉద్యమంలో పనిచేశారు. అంచెలంచెలుగా ఎదుగుతూ అగ్రనేత స్థాయికి చేరుకున్నారు. అయితే, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయారు. కాగా, అనారోగ్యంతో ఉన్న ఆర్కేకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం వైద్యం అందకుండా కట్టడి చేసిందని, కాబట్టి ఇది ఆ ప్రభుత్వ హత్యేనని పలు విప్లవ సంఘాల నేతలు, మావోయిస్టులు విమర్శిస్తున్నారు