‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) వివాదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎన్నికలు జరిగే వరకూ రెండు ప్యానెళ్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఎన్నికలు ముగిసిన తర్వాత సడెన్‌గా ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి ఎన్నికైన 11 మంది సభ్యులూ రాజీనామాలు చేశారు. ఇప్పుడు తాజాగా ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు ప్రకాశ్ రాజ్ లేఖ రాశారు. ‘మా’ పోలింగ్ సమయంలో మోహన్ బాబు చాలా దురుసుగా ప్రవర్తించారని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు.
చాలా విచక్షణారహితంగా మోహన్ బాబు ప్రవర్తన ఉందని విమర్శించారు. మోహన్ బాబు, నరేశ్ ప్రవర్తించిన తీరు సీసీ కెమెరాల్లో రికార్డయిందని ప్రకాశ్ రాజ్ చెప్పారు. ఆ దృశ్యాలు చూస్తే అసలు విషయాలు తెలుస్తాయన్నారు. ఆ సీసీ దృశ్యాలను మోహన్ బాబు తొలగించే అవకాశం ఉందని ప్రకాశ్ రాజ్ చెప్పారు. ఈ క్రమంలో సీసీ కెమెరా దృశ్యాలను తమకు అందించాలని ఎన్నికల అధికారిని కోరారు.
సాధ్యమైనంత త్వరగా సీసీ ఫుటేజిలను తమకు అందించాలని తెలిపారు. పోలింగ్ రోజు మోహన్ బాబు, నరేశ్ బెదిరింపులకు దిగారని చెప్పారు. ప్రకాశ్ రాజ్ లేఖపై ఎన్నికల అధికారి కృష్ణమోహన్ స్పందించారు. పోలింగ్ రోజు నాటి సీసీ ఫుటేజిలు భద్రంగానే ఉన్నాయని, నిబంధనల ప్రకారం ఫుటీజ్‌ను ప్రకాశ్ రాజ్‌కు అందిస్తామని ఆయన వెల్లడించారు.