తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్‌డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో సోమవారం చేనేత బతుకమ్మ-దసరా సంబురాలను ఘనంగా నిర్వహించారు. యూకే నలుమూలల నుంచి సుమారు 600లకుపైగా ప్రవాస కుటుంబాలు ఈ వేడుకలకు హాజరయ్యాయి. భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఎంపీలు వీరేంద్రశర్మ, సిమా మల్హోత్రా, స్థానిక హాన్‌స్లో మేయర్ బిష్ణు గురుగ్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు.
మంత్రి కేటీఆర్ స్ఫూర్తితో చేనేతకు చేయూతనిచ్చేందుకు ప్రతి ఏడాదిలాగే చేనేత దుస్తులు ధరించి బతుకమ్మ- దసరా వేడుకులు చేసుకున్నామని టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం చెప్పారు. కొవిడ్ సమయంలో ప్రజల ప్రాణాలు రక్షించడానికి ఆరోగ్య సిబ్బంది చేసిన కృషిని గౌరవిస్తూ యూకేలోని నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎస్‌హెచ్‌ఎస్), కొవిడ్ వారియర్స్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ.. ఈ వేడుకలను అంకితమిస్తున్నట్టు తెలిపారు.
కార్యక్రమంలో టాక్ ఉపాధ్యక్షులు సత్య చిలుముల, శుష్మణరెడ్డి, కమ్యూనిటీ అఫైర్స్ చైర్మన్ నవీన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.లండన్‌లో తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో సోమవారం బతుకమ్మ, దసరా సంబురాలను ఘనంగా నిర్వహించారు. లండన్ డిప్యూటీ మేయర్ రాజేశ్ అగర్వాల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. లండన్‌లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నవారికి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం అందజేశారు. భారత్ నుంచి తెచ్చిన జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో లండన్ ఎంపీలు వీరేంద్రశర్మ, సీమా మల్హోత్రా, స్థానిక మేయర్ బిష్ణు, ఫోరం అధ్యక్షుడు ప్రమోద్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.