మా ఎన్నికల్లో హీరో మంచు విష్ణు ఫ్యానెల్ గెలుపును ఎన్నికల అధికారి అధికారికంగా ప్రకటించగానే మంచు మోహన్‌బాబు మీడియతో మాట్లాడారు. ఇది ఒక్కరి విజయం కాదనీ, సభ్యులందరి విజయం అని ఆయన అన్నారు. అధ్యక్షుడి అనుమతి లేనిదే గెలుపొందిన సభ్యులు ఎవరూ మీడియా ముందుకెళ్లి ఇంటర్వ్యూ లు ఇవ్వవద్దని ఆయన సూచించారు.
దాని వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుందని పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘మా’ సభ్యులంతా మనవాళ్లే. అందరి ఆశీస్సులతో నా బిడ్డ మంచు విష్ణు గెలిచాడు. ఇది ఆనందం అనుకుంటే కరెక్ట్ కాదు. భయంకరమైన వాగ్దానాలు చేశారు. అవన్నీ నా బిడ్డ విజయానికి కారణమయ్యాయి. చెప్పింది చెప్పినట్లు అన్నీ నెరవేరుస్తాడు.
జరిగింది జరిగిపోయింది. అందరం ఒక తల్లి బిడ్డలం అని గుర్తు పెట్టుకోవాలి. ఎక్కడున్నారో.. నాకు నటుడిగా జన్మనిచ్చిన నా తండ్రి దాసరి నారాయణరావుగారు. ఎన్నికలు ఎప్పుడూ ఏకగ్రీవం కావాలని కోరుకునేవారు. ఇకపై మా ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగేలా పెద్దలు నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నా. ఇంతటితో అన్నింటికీ ఫుల్‌స్టాప్ పెట్టండి. అటు పక్కన ఉన్న ఆడపడుచులు ఇటు పక్కన ఉన్న వారు ప్రెసిడెంట్ అనుమతి లేనిదే మీడియా ముందుకు వెళ్లకూడదు’’ అని చెప్పారు.