కరీంనగర్‌ను డల్లాస్ మాదిరిగా చేస్తానని తాను ఎప్పుడూ చెప్పలేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మానేరు నదిపై చెక్‌డ్యామ్‌లు, వంతెనలు నిర్మిస్తే లండన్‌లోని థేమ్స్ నది మాదిరిగా కనిపిస్తుందని అన్నానని చెప్పారు. నగరాల అభివృద్ధి గురించి రాష్ట్ర ప్రజల్లో సానుకూల దృక్పథాన్ని పెంపొందించేందుకే లండన్, ఇస్తాంబుల్ వంటివాటిని ఉదాహరణగా చెప్పానని తెలిపారు.
అసెంబ్లీలో పల్లె ప్రగతి-పట్టణ ప్రగతిపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ పాత నగరాన్ని ఇస్తాంబుల్ చేస్తమన్నరు.. ఇంకెప్పుడు చేస్తరు? అని ప్రతిపక్ష నేతలు అడుగుతున్నరు. మీకేమో కలలుగనే ధైర్యం లేకపాయే.. మేము అది కూడా చేయొద్దా? జనాన్ని పాజిటివ్ లైన్‌లోకి తీసుకుపోవద్దా? ఇస్తాంబుల్ చేస్తామనడం తప్పా? దశలవారీగా అయితది.
బరాబర్ చేస్తం’ అని చెప్పారు. తమకు ఒక రోప్‌వే బ్రిడ్జి కావాలని మంత్రి గంగుల కమలాకర్ నన్ను కోరితే.. ‘మానేరు నది మంథని వద్ద గోదావరిలో కలిసేలోగా 90 కిలోమీటర్లు పారుతది. ఈ ప్రాంతంలో వరుసగా చెక్‌డ్యామ్‌లు కట్టి, బోట్లు పోయేలా ఒక దారి ఏర్పాటు చేసుకొని, మధ్యలో రోప్‌వే బ్రిడ్జి కడితే లండన్‌లో థేమ్స్ నది మీద బ్రిడ్జి ఎట్లా కనిపిస్తదో.. మీ కరీంనగర్ కూడా అట్లా అయితది’ అని చెప్పిన. ఇది తప్పా?’ అని ప్రశ్నించారు. తాను చెప్పిన రోప్ వే బ్రిడ్జికి రూ.360 కోట్లు మంజూరు చేశామని, పని దాదాపు పూర్తయిందని తెలిపారు.