పిల్లల్లో ప్రాణాంతకంగా పరిణమించిన మలేరియాను నిర్మూలించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) విశేషంగా కృషి చేస్తున్నది. దీనిలో భాగంగా ప్రపంచంలో మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్ (ఆర్టీఎస్, ఎస్/ఏఎస్01) కు డబ్ల్యూహెచ్‌ఓ ఆమోదం తెలిపింది. ఈ వ్యాక్సిన్‌ను మలేరియా ఎక్కువగా ప్రభావితమైన ఆఫ్రికన్ దేశాల నుంచి ప్రారంభించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇది సక్సెస్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా మలేరియా వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు నిధుల సమీకరణపై దృష్టి పెట్టనున్నది. తద్వారా ఈ టీకా అవసరమైన ప్రతి దేశానికి చేరాలన్న డబ్ల్యూహెచ్‌ఓ కల తీరనున్నది. దీని అనంతరం మలేరియాను నియంత్రించే చర్యల్లో ఈ టీకాను చేర్చడంపై ఆయా దేశాల ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి.
చిన్నారుల్లో మలేరియాను నిర్మూలించేందుకు ఆర్టీఎస్ ఎస్ వ్యాక్సిన్ ఉపయోగించేందుకు డబ్ల్యూహెచ్‌ఓ ఆమోదం తెలుపడంతో.. తొలుత ఘనా, కెన్యా, మలావి వంటి ఆఫ్రీకన్ దేశాల్లో పైలట్ ప్రోగ్రాం క్రింద ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నారు. దాదాపు 23 లక్షల మంది చిన్నారులకు టీకాలు ఇస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ ఆఫ్రికా ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ మత్షిడిసో మోతీ చెప్పారు. పైలట్ ప్రాజెక్ట్ ఫలితాల ప్రకారం, మలేరియా వ్యాక్సిన్ సురక్షితం. 30 శాతం తీవ్రమైన కేసులను నిరోధించవచ్చు. ఈ టీకా ఇచ్చిన పిల్లల్లో మూడింట రెండు వంతుల మంది దొమతెరలు లేనివారే ఉన్నారు. మలేరియా వ్యాక్సిన్‌ను నివారించేందుకు ఇతర టీకాలు లేదా ఇతర చర్యలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని కూడా వెల్లడైంది.
ప్రపంచవ్యాప్తంగా 2019 నుంచి 8,00,000 మందికి పైగా పిల్లలకు మలేరియా ఇబ్బంది పెడుతున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఒక్క భారతదేశం నుంచే ఏటా 3 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మలేరియా కారణంగా ప్రతి రెండు నిమిషాలకు ఒక చిన్నారి చనిపోతున్నట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. 2019 లో ప్రపంచవ్యాప్తంగా మలేరియా కారణంగా 4.09 లక్షల మంది మరణించారు. ఇందులో 67 శాతం మంది చిన్నారులు ఉన్నారు. 2019 లో మన దేశంలో 3,38,494 మలేరియా కేసులు నమోదవగా, 77 మంది చనిపోయారు. గత ఐదేండ్లలో 2015 లో భారతదేశంలో మలేరియా కారణంగా అత్యధికంగా 384 మంది మరణించారు.