తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో సేంద్రీయ సాగును ప్రోత్సహిస్తుందని, అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సేంద్రీయ సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.
రైతాంగం శ్రేయస్సు కోసం కేంద్రం ఆలోచనా ధోరణి మారాలి అని అన్నారు. పంటలను సమతుల్యం చేయడంలో కేంద్రం బాధ్యత తీసుకోవాలి. పప్పుగింజలు, నూనె గింజలు వంటి పంటలను సమతుల్యం చేయాలి. వ్యవసాయంలో సేంద్రీయ సాగును ప్రోత్సహిస్తున్నాం అని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.
1967లో సస్యవిప్లవం తర్వాత దేశంలో పంటసాగులో ఎరువులు, రసాయనాల వాడకం మొదలయింది. దేశంలో ప్రజల ఆకలిని తీర్చేందుకు పంట ఉత్పత్తులు పెంచడంలో భాగంగా నూతన వంగడాల సృష్టి, ఎరువుల ప్రవేశం మొదలయింది. 1967 కు ముందు దేశంలోని సాంప్రదాయ వ్యవసాయంలో పశువుల, మేకలు, గొర్రెల ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, ఆకులు, అలముల వంటివి మినహా మనదేశంలో ఏ ఎరువులు వినియోగంలో లేవు. సేంద్రీయ వ్యవసాయం అంటే అదేదో కొత్త విధానం అనుకుంటున్నారు. గ్లైఫోసెట్ అనే గడ్డి మందును తెలంగాణ ప్రభుత్వం నిషేదించింది అని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రజలే సొంతంగా మిద్దె తోటల సాగుకు మొగ్గు చూపుతున్నారు. ప్రజా ప్రతినిధులు ఈ దిశగా దృష్టి సారించాలి. ఉద్యానశాఖ మిద్దె తోటలకు ప్రోత్సాహం ఇస్తుంది అని మంత్రి స్పష్టం చేశారు. ఎరువులు, రసాయనాలు వాడొద్దంటే.. ఎరువుల కొరత ఉందేమో అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. విత్తనం నుండి వినిమయం వరకు రైతాంగానికి సంపూర్ణ అవగాహన, చైతన్యం కల్పించాలి. రసాయనిక, ఎరువుల అవశేషాలు లేని పంట ఉత్పత్తులకు అంతర్జాతీయ విపణిలో డిమాండ్ ఉంది. సేంద్రీయ సాగుపై రైతులకు నమ్మకం కలిగేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కార్యాచరణ చేయాలి. సేంద్రీయ సాగులో ప్రపంచంలో క్యూబా, దేశంలో సిక్కిం రాష్ట్రం అదర్శంగా నిలిచాయి.