ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామ పంచాయతీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీ ఆదాయం నుంచి ప్రతినెలా రూ. 2వేలు, సర్పంచ్ , ఎంపీటీసీల గౌరవ వేతనం నుంచి రూ.500 చొప్పున మొత్తం మూడు వేలు హరితనిధికి ఇచ్చేందుకు తీర్మానం చేశారు. ఇప్పటికే హరితహారం గురించి ముక్రా గ్రామం సాధించిన ప్రగతిని అసెంబ్లీలో స్వయాన ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు.
దీంతో గురువారం ముక్రా (కే) గ్రామ సర్పంచ్ గాడ్గె మీనాక్షీ అధ్యక్షతన పంచాయతీ పాలక వర్గ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించిన హరిత నిధి భావితరాలకు పునాధిలాంటిదని సర్పంచ్ అన్నారు.సీఎం కేసీఆర్ పిలుపు మేరకు హరిత నిధికి మేము సైతం అంటూ జీపీ ఆదాయం నుంచి రూ. 2 వేలు, సర్పంచ్, గౌరవ వేతనం నుంచి రూ. 500, ఎంపీటీసీ గౌరవ వేతనం నుంచి రూ. 500 చొప్పున నెల నెలా రూ. 3 వేలు హరిత నిధికి ఇస్తామంటూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
నిధుల కొరత తలెత్తకుండా ఉండేందుకు తమ వంతుగా జీపీ నుంచి సహాయంగా క్రమం తప్పకుండా చెల్లిస్తామంటూ పాలక వర్గం సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గాడ్గె సుభాశ్, ఉప సర్పంచ్ వర్షతాయి, పంచాయతీ కార్యదర్శి కిరణ్, పాలక వర్గం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.