హుజూరాబాద్ ఓటర్లూ ఉద్యమపార్టీవైపే చూస్తున్నారు. ఇందుకు నిదర్శనం ఇటీవల పార్టీలోకి పెరిగిన చేరికలే. తాజాగా ఇల్లందకుంట మండలం రాచపల్లి, సింగపురం గ్రామాలకు చెందిన 300 మంది కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. ఆయా సామాజిక వర్గాల ఓటర్లు సైతం గెల్లు గెలుపు తమ బాధ్యత అంటూ ప్రకటిస్తున్నారు. రాచపల్లికి చెందిన యువనేత అశోక్ యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యాదవులు, ముస్లింలు 150 మంది సింగపురంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం సింగపురానికి చెందిన మరో 150 మంది యువకులు టీఆర్ఎస్‌లో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ఇక్కడ ఓట్ల కోసం రైతుల జపం చేస్తున్న బీజేపీ పార్టీ.. మరో రాష్ట్రంలో రైతులపై ఉక్కుపాదం మోపుతూ, ధర్నాలు చేస్తున్న వారిపై వాహనాలు ఎక్కించిమరీ చంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడున్నా బీజేపీ విధానం ఒక్కటేనని, ఆ పార్టీకి ఓట్లు వేస్తే.. మళ్లీ రైతు ఆత్మహత్యలు చూడాల్సి వస్తుందని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ పని చేస్తున్నారన్నారు. ఈ దిశగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, 2016 రూ. ఆసరా పెన్షన్ వంటి పథకాలు ప్రజలు ఎంతో మేలు చేస్తున్నాయని చెప్పారు.