Home / SLIDER / ఒక్క ఫోన్‌ చేస్తే మీ ఇంటికి వస్తా..!-గెల్లు శ్రీనివాస్ యాదవ్

ఒక్క ఫోన్‌ చేస్తే మీ ఇంటికి వస్తా..!-గెల్లు శ్రీనివాస్ యాదవ్

హుజూరాబాద్‌ అభివృద్ధికి ఈటల రాజేందరే ప్రధాన అడ్డంకి అని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ విమర్శించారు. ఆయనను ఇక్కడి నుంచి తరిమికొడితే తప్ప ఈ ప్రాంతం బాగుపడదన్నారు. ఉన్నోళ్లతో సోపతి చేసి.. పేదోళ్లను వదిలేశారని విమర్శించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు సంపాదించిన రాజేందర్‌కు.. ఇప్పుడే ఆత్మగౌరవం ఎందుకు గుర్తుకొచ్చిందని ప్రశ్నించారు. రాజకీయంగా పెంచి పెద్ద చేసిన సీఎం కేసీఆర్‌ను విమర్శించడంలోనే ఆయన స్వార్థం బయటపడిందన్నారు. ఈ ఎన్నికల్లో ఈటల ఓటమి తథ్యమని స్పష్టంచేశారు. తనకు వేల కోట్ల ఆస్తులు, వ్యాపారాలు లేవని, గతంలో తన వ్యాపకం తెలంగాణ ఉద్యమమైతే.. ఇప్పుడు ప్రజాసేవే అని ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు.

ఈటల రాజేందర్‌కు ఏ భావజాలం లేదని ఉన్నది ఒక్కటే.. అది కార్పొరేట్‌ పాలసీ అని హుజూరాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ మండిపడ్డారు. ప్రతి విషయాన్ని పైసలతోనే చూస్తారని, పైసలు ఉన్నోళ్లతోనే సోపతి చేస్తారని విమర్శించారు. ‘ఏ ఒక్క సాధారణ కార్యకర్త ఇంట్లోనైనా భోజనం చేశారో చెప్పమనండి. కానీ కేసీఆర్‌ మాత్రం తిన్న తర్వాతనే మరో పని అంటరు. అందరినీ సమానంగా చూస్తరు. అందరి సాదకబాధకాలను చూస్తరు’ అని తెలిపారు.

మంత్రిగా పనిచేసి.. ప్రభుత్వ పథకాలన్నీ ‘పరిగె’ అని ఈటల ఏ విధంగా విమర్శిస్తారని గెల్లు ప్రశ్నించారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన రైతు చట్టాలను వ్యతిరేకించిన ఈటల.. ఇప్పుడు ఆ చట్టాలు తెచ్చిన బీజేపీలోకి ఎలా వెళ్లారని నిలదీశారు. బీజేపీలో చేరికనే ఆయన అసలు నైజాన్ని బయట పెట్టిందంటున్న గెల్లుతో నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూ..

కేటీఆర్‌ చొరవ నన్ను టీఆర్‌ఎస్‌లోకి నడిపింది

2001లో ఇంటర్‌ చదివే రోజుల్లో తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్‌ ప్రసంగాలకు ఆకర్షితుడినై అభిమానిగా మారా. 2003 నుంచి ఉద్యమంలో పాల్గొంటూ వచ్చా. తెలుగు యూనివర్సిటీలో టీఆర్‌ఎస్‌ విద్యార్థి సంఘానికి ఇంచార్జిగా పనిచేశా. ఆ తర్వాత టీఆర్‌ఎస్వీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశా. కేసీఆర్‌ 2009లో నన్ను ఉస్మానియా వర్సిటీ టీఆర్‌ఎస్వీ విభాగానికి అధ్యక్షుడిగా నియమించారు. కరీంనగర్‌ ఎంపీ స్థానానికి కేసీఆర్‌ రాజీనామాతో ఉప ఎన్నిక సందర్భంగా సిరిసిల్ల వెళ్లినప్పుడు కేటీఆర్‌ను హరీశ్‌రావు పరిచయంచేశారు. ఏవీ కాలేజీ విషయంలో మమ్మల్ని పోలీసులు అరెస్ట్‌ చేస్తే కేటీఆర్‌ చొరవ తీసుకొని విడిపించారు. అంకితభావంతో పనిచేస్తే గుర్తింపు ఉంటుందని.. పార్టీ అండగా నిలిచి కాపాడుకుంటుందని అర్థమైంది. దీంతో పార్టీ కోసం పూర్తికాలం పనిచేయాలని నిర్ణయించుకున్నా.

ఒక్క ఫోన్‌ చేస్తే మీ ఇంటికి వస్తా..!

నాకు ఈటల రాజేందర్‌లాగా హైదరాబాద్‌లో ఇల్లు లేదు.. వ్యాపారాల్లేవ్‌.. ఒక్క ఫోన్‌ చేస్తే మీ ఇంటికి వస్తా.. మీకు అందుబాటులో ఉంటా.. సీఎం కేసీఆర్‌ నన్ను నమ్మి టికెట్‌ ఇచ్చారు.. మీ ఆశీర్వాదం ఉంటే, మీకు సేవ చేసుకుంటా. సీఎం కేసీఆర్‌ ఈటలకు పెద్దపీట వేసి రెండుసార్లు మంత్రి పదవి ఇస్తే ఆయన ఆస్తులు పెంచుకున్నాడు. ఈటలకు ప్రజాసేవ చేయడం ఇష్టం లేదు. అందుకే రాజీనామా చేసిండు. ఆయన మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దు. మంత్రిగా ఉన్నప్పుడే అభివృద్ధి చేయలేని ఈటల.. బీజేపీ నుంచి గెలుస్తే చేసేదేమీ ఉండదు. హుజూరాబాద్‌కు మెడికల్‌ కాలేజీ తీసుకొచ్చే బాధ్యత నాది. నన్ను గెలిపించండి.
-ఇంటింటా ప్రచారంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌

హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ పరిస్థితి ఎలా ఉన్నది?

హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ బంపర్‌ మెజార్టీతో గెలువబోతున్నది. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం అవసరం లేదు. హుజూరాబాద్‌ ప్రజలు అప్పుడు.. ఇప్పుడు.. ఎల్లప్పుడూ టీఆర్‌ఎస్‌తోనే ఉన్నారు.. ఉంటారు.

మీ కుటుంబ, రాజకీయ నేపథ్యం?

మాది వ్యవసాయ కుటుంబం. రెండున్నర ఎకరాల భూమి ఉంటే మా నాన్న రాజకీయాల్లోకి వచ్చి అదీ అమ్మేశారు. కుటుంబానికి కొంత రాజకీయ నేపథ్యం ఉన్నది. అమ్మ సర్పంచ్‌గా, నాన్న వార్డ్‌ మెంబర్‌గా, సర్పంచ్‌గా, ఎంపీటీసీగా పనిచేశారు. ఇప్పుడు కౌలుకు వ్యవసాయం చేస్తున్నారు. నేను 20 ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్నాను.. కానీ సంపాదించింది ఏమీ లేదు. ఏనాడూ పదవుల కోసం ఆశ పడలేదు.

మీ ఎదుగుదలకు ఈటల ఎలాంటి ప్రోత్సాహం ఇచ్చారు?

2009లో ఈటలతో పరిచయం. ఇక్కడ ఆయన తప్ప మరో బలమైన నాయకుడు ఉండొద్దని అందర్నీ తొక్కేసేవారు. నేనూ ఆయన బాధితుడినే. టీఆర్‌ఎస్వీ అధ్యక్ష స్థానానికి నా పేరు ప్రతిపాదించాలని బాల్క సుమన్‌.. ఈటలను కోరితే.. ‘ప్రెసిడెంట్‌ చేస్తే ఏమోస్తది తమ్మీ.. మంచి బిజినెస్‌ పెట్టుకో పైసలొస్తయ్‌.. గా టీఆర్‌ఎస్వీ ప్రెసిడెంట్‌లో ఏముంటది? గెల్లుకు, నీకు నా పౌల్ట్రీలోనే మంచి ఉద్యోగం, వెహికిల్‌ ఇస్తా, మంచి జీతం ఇస్తా.. చేసుకోండి’ అన్నరు. అదే కేసీఆర్‌ను అడగగానే.. ‘టీఆర్‌ఎస్వీకి తర్వాత నువ్వే అధ్యక్షుడివి’ అని హామీ ఇచ్చారు. నన్ను హుజూరాబాద్‌కు పూర్తిగా దూరం చేసే కుట్ర పన్నారు. ఇక్కడ పార్టీ సమావేశాలపై నాకు సమాచారం ఉండేది కాదు. ఎవరైనా నాకు టచ్‌లోకి వస్తే వారినీ ఇబ్బంది పెట్టేవారు. నేను టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడైన తర్వాత ఇంకా ఎక్కువ కుట్రలు చేశారు.

ముదిరాజ్‌లకు ఈటల ఏం చేశారు?

ముదిరాజ్‌ బిడ్డనని చెప్పుకోవడం తప్ప ఇంతవరకు ఈటల రాజేందర్‌ బీసీలకు, ముదిరాజ్‌లకు చేసిందేమీ లేదు. ఆయన రాజీనామా చేసిన తర్వాతే ఇక్కడ పెద్దమ్మతల్లి గుడి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఇప్పుడు ముదిరాజ్‌లంతా ఆయన మోసాలను తెలుసుకుంటున్నారు.

తనపై కేసీఆర్‌కు కోపం ఉన్నదని ఈటల చెప్తున్నారు!

ఈటలపై కేసీఆర్‌కు నిజంగా కోపం ఉంటే 2018 ఎన్నికల్లో టికెట్‌ ఇచ్చేవారే కాదు. కేసీఆర్‌ హుజూరాబాద్‌లో సభ పెట్టి ఈటల గురించి ఎంతో గొప్పగా చెప్పారు. కాబట్టే ఈటల గెలిచిండు. ఈటలకు అన్యాయం చేయాలనుకొంటే మంత్రి పదవి ఎందుకు ఇస్తరు? ఈటలనే పేద రైతులకు అన్యాయం చేశారు. పేద రైతుల అసైన్డ్‌ భూమిని తీసుకున్నట్టు స్వయంగా ఒప్పుకున్నరు. ఓ మంత్రిపై ఫిర్యాదు వచ్చింది కాబట్టి.. ప్రభుత్వం బదనాం కావొద్దనే సీఎం విచారణకు ఆదేశించారు. ఆయన తప్పు చేయకపోతే.. విచారణను స్వాగతించాలి.. కానీ అలా చేయలేదు. అసైన్డ్‌ భూమిని తీసుకున్న ఈటల.. ఎస్సీ, బీసీల పక్షపాతి ఎలా అవుతారు? మారుమూల ప్రాంతాల్లోనే ఎకరం రూ.15 లక్షలు పలుకుతున్నది.. అలాంటిది హైదరాబాద్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమిని రూ.6 లక్షలకు తీసుకున్నరు అంటే.. అది కొన్నట్టా.. గుంజుకున్నట్టా? ఐదేండ్ల నుంచి సీఎంకు తనకు గ్యాప్‌ ఉన్నదని అంటున్న ఈటల.. అదే నిజమైతే, ఆత్మగౌరవం దెబ్బతిన్నదని అనిపిస్తే అప్పుడే పార్టీ నుంచి ఎందుకు వెళ్లిపోలేదు? అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు సంపాదించిన రాజేందర్‌కు.. ఇప్పుడే ఆత్మగౌరవం ఎందుకు గుర్తుకొచ్చింది? ఇది ఆత్మగౌరవం కాదు.. ఆత్మరక్షణ.

ఈటల ఎలాంటి అభివృద్ధి చేశారు? ప్రజలకు ఏంచేశారు?

ఎమ్మెల్యేగా, మంత్రిగా హుజూరాబాద్‌కు ఈటల చేసిందేమీ లేదు. ఇక్కడి అభివృద్ధిపై, యువతకు ఉపాధి కల్పనపై ఏనాడూ దృష్టి పెట్టలేదు. ఆయన చేసే ఏ వ్యాపారంలోనూ స్థానిక యువతకు ఉద్యోగాలు దక్కలేదు. నిజంగా హుజూరాబాద్‌పై ప్రేమ ఉంటే ఆరోగ్య మంత్రిగా ఇక్కడ మెడికల్‌ కాలేజీని ఎందుకు సాధించలేదు? తన ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీని ఎక్కడో ఎందుకు పెట్టారు? తన పౌల్ట్రీ వ్యాపారాన్ని ఇక్కడ ఎందుకు విస్తరించలేదు? ఇక్కడ ఒక్క పౌల్ట్రీ ఫాం కట్టినా.. వందల మందికి ఉపాధి దొరికేది. ఆర్థిక మంత్రిగా ఒక్క పరిశ్రమనూ తీసుకురాలేదు. నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు కాదు.. చిన్న చిన్న కార్యక్రమాలుంటే ఇలా వచ్చి అలా వెళ్లేవారు. నియోజకవర్గంలో అందుబాటులో ఉండరు కాబట్టే.. ఆయన ఇంటికి వెళ్లేవారు. కానీ అక్కడ కూడా ఆయన దొరికేవారు కాదు.. దొరికినా సమస్యను వినేవారు కాదు.. పరిష్కరించేవారు కాదు.

కార్యకర్తలను ఈటల ఎలా చూసుకొనేవారు?

హుజూరాబాద్‌లో తన ప్రాభవం తగ్గకూడదన్న ఉద్దేశంతో పార్టీ క్యాడర్‌ అధిష్ఠానానికి దగ్గర కాకుండా జాగ్రత్త పడ్డారు. ఒకవేళ ఎవరైనా ఆయనకు తెలియకుండా పార్టీ పెద్దలను కలిస్తే ఖతమే. కార్యకర్తలకు, పార్టీని నమ్ముకున్నవాళ్లకు చేసిందేమీ లేదు. ఎవరైతే సార్‌కు (కేసీఆర్‌) వ్యతిరేకంగా మాట్లాడుతారో వాళ్లకే ముందుగా పనిచేసేవారు. నియోజకవర్గంలో జరిగే సమావేశాల్లో అభివృద్ధి పనుల గురించి చెప్పేవారు.. కానీ ఎక్కడా సార్‌ పేరు ప్రస్తావించేవారు కాదు. ఈటల పౌరసరఫరాలశాఖ మంత్రిగా ఉన్నప్పుడు రూ.2 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. అప్పుడు నేనొక్కడినే హుజూరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి ఆ ఆరోపణలను ఖండించా. మరుసటి రోజు ఈటలను కలిస్తే.. కనీసం మాట వరుసకైనా మెచ్చుకోలేదు.

సీఎం కేసీఆర్‌తో పరిచయం? ఆయనతో మీకున్న అనుబంధం ఎలాంటిది?

పుస్తకాల కోసం వీ ప్రకాశ్‌ తరచూ తెలుగు యూనివర్సిటీకి వచ్చేవారు. అప్పుడు ఆయనతో పరిచయం ఏర్పడింది. ఆయనే ఒకసారి నన్ను సార్‌ వద్దకు తీసుకెళ్లి పరిచయంచేశారు. కేసీఆర్‌ను కలవడం అదే మొదటి సారి. ఆ సమయంలో కేసీఆర్‌.. ఇతను నాకు తెలుసని చెప్పడంతో ఎంతో సంతోషించాను. కేంద్రమంత్రి పదవికి కేసీఆర్‌ రాజీనామా చేసి.. ఢిల్లీ జంతర్‌మంతర్‌లో ధర్నాచేశారు. అప్పుడు సిటీలో టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో నారాయణగూడ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ తగలబెట్టి ధర్నాచేశాం. టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడి ఎంపికలో నా పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడు నన్ను చూసి.. ‘నువ్వేనా గెల్లు శ్రీను.. నువ్వు నాకెందుకు తెల్వదు! నీకు అధ్యక్ష పదవి ఇస్తున్న.. మంచిగా పని చేసుకో’ అని చెప్పారు.

సీనియర్‌ నేతలకు, కార్యకర్తలకు ఈటల ప్రాధాన్యం ఇచ్చేవారా?

ఈటల కన్నా ముందే హుజూరాబాద్‌, కమలాపూర్‌ ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌కు కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు పెద్ద లీడర్‌. ఈటల వచ్చాక.. కెప్టెన్‌ను కూడా ఇబ్బందులకు గురిచేశారు. కెప్టెన్‌ భార్యపై కాంగ్రెస్‌ ఎంపీటీసీలతో అవిశ్వాసం పెట్టించి పదవి నుంచి దించారు. 2014లో నగరపంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మెజార్టీ ఉన్నా, కాంగ్రెస్‌ అభ్యర్థిని చైర్మన్‌గా చేశారు. టీఆర్‌ఎస్‌ జమ్మికుంట మున్సిపల్‌ చైర్మన్‌ రామస్వామి, హుజూరాబాద్‌ చైర్మన్‌ విజయకుమార్‌పై కక్షగట్టి ఇద్దరిపై అవిశ్వాస తీర్మానం పెట్టి.. పదవి నుంచి దింపేవరకు వదిలిపెట్టలేదు. మా నాన్నను కూడా పార్టీలో, రాజకీయంగా ఎదగకుండా ఈటల అడ్డుకొన్నరు.

ఓటర్ల నుంచి ఏం కోరుకొంటున్నారు?

హుజూరాబాద్‌ ప్రజలు మొదటి నుంచీ టీఆర్‌ఎస్‌తోనే ఉన్నారు. ఈసారి కూడా అండగా ఉండండి. తెలంగాణ ఆత్మగౌరవం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమవుతుంది. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటేసి.. సీఎం కేసీఆర్‌కు మద్దతుగా ఉండాలని కోరుతున్నా. సీఎం కేసీఆర్‌ పాలనలోనే తెలంగాణ ఆత్మగౌరవం, ప్రజల ఆత్మగౌరవం పెంపొందుతుంది.

హుజూరాబాద్‌ ప్రజలకు మీరేం చేయబోతున్నారు?

రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలంటే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి.. హుజూరాబాద్‌ ప్రజలంతా టీఆర్‌ఎస్‌తోనే ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా. నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటా. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తిచేయిస్త. 4 వేల డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు పూర్తిచేసి.. అర్హులైన ప్రతి పేదకు ఇప్పించే బాధ్యత నాది. సీఎం కేసీఆర్‌తో మాట్లాడి.. హుజూరాబాద్‌లో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు కృషిచేస్తా. రూ.10 ఆటో ఖర్చులో దొరికే విధంగా అందుబాటులో ఉంటా. హైదరాబాద్‌లో నాకు ఇల్లు లేదు.. ఆస్తులు లేవు. నా ఇల్లు ఊర్లోనే ఉన్నది. నాకు మరే ఇతర సొంత వ్యాపారాలు లేవు. వ్యాపారం చేసే స్నేహితులూ లేరు. నా వ్యాపకం గతంలో ఉద్యమం.. ప్రస్తుతం ప్రజాసేవ.

నియోజకవర్గ యువతకు మీరు ఇచ్చే సందేశం?

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాతే రాష్ట్రంలో 1.30 లక్షల ఉద్యోగాల భర్తీ జరిగింది. కొత్త పారిశ్రామిక పాలసీని తీసుకొచ్చి.. 16 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించింది. గతంలో ఉద్యోగాల కోసం ధర్నాలు చేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు కొందరు రాజకీయ నిరుద్యోగులు తప్ప.. నిజంగా యువత ఎక్కడా ధర్నాలు చేయడం లేదు. నిజానికి యువత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం.. తన పరిధిలోని ఉద్యోగాలు ఎప్పటికప్పుడు భర్తీ చేస్తుంటే.. కేంద్రం తన పరిధిలోని ఉద్యోగాలను భర్తీ చేయడం లేదు. పైగా ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తున్నది. ఇందుకు వ్యతిరేకంగా బీజేపీపై పోరాటం చేసినప్పుడే యువతకు భవిష్యత్తు. ఇందుకు హుజూరాబాద్‌ ఎన్నికను ఒక అస్త్రంగా మలుచుకోవాలి. బీజేపీ ప్రజా, యువత వ్యతిరేక విధానాలకు ఓటుతో బుద్ధి చెప్పాలి.

తనను పార్టీ నుంచి బలవంతంగా వెళ్లగొట్టారని ఈటల అంటున్నరు.. ఇందులో నిజముందా?

రాజయ్యను క్యాబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేస్తే ఆయన ఎమ్మెల్యేగా కొనసాగలేదా? ఆ తర్వాత కేసీఆర్‌ మళ్లీ ఆయనకు టికెట్‌ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆయన పార్టీతోనే ఉన్నాడు కదా! మరి ఈటల ఎందుకు తొందరపడ్డారు? ఓపిక లేకుండా పార్టీపై, ప్రభుత్వంపై, సీఎంపై ఏవేవో ఆరోపణలు చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిండు. కాంగ్రెస్‌ నాయకుల ఇళ్లకు ఎందుకు వెళ్లాడు? ఆయన్ను ఎవరూ బయటికి పంపించలేదు. అదే సమయంలో కార్యకర్తలెవరూ కూడా పార్టీని వీడి పోలేదు. ఈ రోజు గ్రామాల్లోని నాయకులను, కార్యకర్తలను డబ్బులిచ్చి కొందామని చూస్తున్నడు. డబ్బులు, మద్యం పంచుతూ.. ఎన్నికలను, రాజకీయాలను కలుషితం చేస్తున్నడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat