హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు కోసమే పరితపిస్తున్నారన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం సొంత పార్టీని బలి పెడుతున్నాడని కాంగ్రెస్ సీనియర్లే రగిలి పోతున్నారు. వ్యూహాత్మకంగానే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ను, స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులను బలిపశువులను చేస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
అభ్యర్థి ఎంపికలో కమిటీలు, దరఖాస్తుల పేరుతో మొదటినుంచీ రేవంత్‌రెడ్డి హైడ్రామా క్రియేట్ చేశారు. కొండా సురేఖ తదితరుల పేర్లను కావాలనే ప్రచారంలోకి తీసుకొచ్చారని, ఆ తర్వాత అసలు దరఖాస్తే చేసకోని స్థానికేతరుడు, తనకు నచ్చిన బల్మూరి వెంకట్‌ను అభ్యర్థిగా ఖరారు చేశారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. వాస్తవానికి హుజూరాబాద్‌లో రెడ్డి సామాజికవర్గం బలంగా ఉన్నది. ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు కూడా కాంగ్రెస్‌లో బలంగానే ఉన్నారు. వాళ్లందర్నీ కాదని స్థానికేతురుడైన వెంకట్‌ను అభ్యర్థిగా ప్రకటించడంపై పార్టీ సీనియర్లు విస్మయం వ్యక్తంచేశారు. ఏ విధంగానైనా ఈటలను గెలిపించాలనే తపనతోనే రేవంత్‌రెడ్డి ఇలాంటి రాజకీయం చేశారని మండిపడుతున్నారు.
ఒక్క దెబ్బ.. మూడు లక్ష్యాలు
కాంగ్రెస్‌లో తన ప్రాభవాన్ని పెంచుకొని, పార్టీని గుప్పిట్లోకి తీసుకొనేందుకు రేవంత్‌రెడ్డి పావులు కదుపుతున్నారని పరిశీలకులు అంటున్నారు. ఇందుకు హుజూరాబాద్ వేదికగా పథకాన్ని అమలు చేస్తున్నారని చెప్తున్నారు. సీనియర్ నేతలను రాజకీయంగా సమాధిచేసి, తనతోపాటు టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చినవాళ్లకు, తన అనుయాయులకు భవిష్యత్తులో మార్గం సుగుమం చేసే పనిలో పడ్డారన్న వాదన ఉన్నది. ఇందుకోసం ఒకే దెబ్బతో మూడు లక్ష్యాలను ఛేదించే వ్యూహాన్ని రచించారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. పెద్దపల్లిలో తనకు నమ్మకస్తుడైన టీడీపీ సహచరుడు విజయరమణరావు స్థానాన్ని సుస్థితరం చేసేందుకు బల్మూరి వెంకట్ అడ్డంకిగా ఉండటంతో ఆయనను హుజురాబాద్ టిక్కెట్ పేరుతో తప్పించారని చెప్తున్నారు.
గెలుపు అవకాశాలు ఏమాత్రం లేని చోట వెంకట్‌కు టికెట్ ఇచ్చి ఆయన రాజకీయ జీవితానికి ముగింపు పలికే పన్నాగానికి తెరలేపారని తెలుస్తున్నది. వెంకట్ ఓ సీనియర్ కాంగ్రెస్ నేతకు దగ్గరి వ్యక్తి. ఆ నేతకు షాక్ ఇచ్చేందుకు వెంకట్‌ను రేవంత్ పావుగా వాడుకొంటున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి. హుజూరాబాద్‌లో వెంకట్‌కు ఎలాంటి బలం, బలగం లేదు. ఆయనెవరో కూడా అక్కడి ప్రజలకు తెలియదు. దీంతో అయన ఓటమి ఎప్పుడో ఖాయమైంది. ఓటమిని సాకుగా చూపి, ఆయనపై పనికిరాడనే ముద్రవేసి శాశ్వతంగా రాజకీయాలను తప్పించే కుట్రలకు రేవంత్ తెరలేపారని భావిస్తున్నారు. అంతిమంగా తన ఆప్తమిత్రుడైన బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను గెలిపించే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు.