సిద్దిపేట పట్టణం కేసీఆర్ నగర్‌లో మూడో విడుతలో భాగంగా మరో 360 డబుల్ బెడ్రూం ఇండ్లలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు లబ్దిదారుల చేత గృహ ప్రవేశాలు చేయించారు. ఈ సందర్భంగా ఆచార్య జయశంకర్ కమ్యూనిటీ హాల్ లో ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.
అనంతరం పీఎన్‌జీ వంట గ్యాస్ సరఫరాను ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. కేసిఆర్ నగర్‌లో 360 డబుల్ బెడ్రూం ఇండ్లు గృహ ప్రవేశాలు చేయించడం, పీఎన్‌జీ వంట గ్యాస్ సరఫరా ప్రారంభోత్సవం, బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.
పేద ప్రజలు కొత్త వస్త్రాలు ధరించి బతుకమ్మ పండుగను ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆడబిడ్డలకు చీరలను పంపిణీ చేస్తున్నారని తెలిపారు. నాణ్యమైన, చూడ చక్కని 110 రకాల రంగు రంగుల చీరలను ఆడపడుచులకు పంపిణీ చేస్తున్నాం అని పేర్కొన్నారు. జిల్లాలో ఆహార భద్రత కార్డు కలిగిన 3 లక్షల 83 వేల మందికి చీరలను పంపిణీ చేయనున్నాం అని స్పష్టం చేశారు.