ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ప్రజా ఉద్యమంగా మారిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు. శాసనసభలో హరితహారంపై స్వల్పకాలిక చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. హరితహారం కార్యక్రమం సీఎం కేసీఆర్ మానస పుత్రిక అని పేర్కొన్నారు. 24 శాతం ఉన్న గ్రీనరీని పెంచేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో తామంతా భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో 3.67 శాతం గ్రీనరీ పెరిగింది. ఈ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. చైనా, బ్రెజిల్ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టి భారతదేశానికే పేరు తెచ్చిందన్నారు.
సీఎం కేసీఆర్ ఇచ్చే నినాదం ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తోంది. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ఉద్యమంలా కొనసాగుతోంది. సీఎం కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని సంతోష్ కుమార్ చేపట్టారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను ఎంతో మంది ప్రశంసిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి కూడా హరితహారం కార్యక్రమాన్ని ప్రశంసించింది. హరితహారం కార్యక్రమాన్ని చాలా మంది వ్యతిరేకించారు. కానీ ఈ కార్యక్రమం అమలు చేసిన తర్వాత వాతావరణంలో మార్పులు వచ్చాయి. వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. వాతావరణంలో సమతుల్యత ఏర్పడింది.