కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్కకు సీఎం కేసీఆర్ చురకలంటించారు. సర్పంచ్‌ల విషయంలో భట్టి మాట్లాడుతుంటే ఆశ్చర్యమేస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో సర్పంచ్‌లను పట్టించుకోలేదు. గ్రామాల్లో అభివృద్ధి జరగలేదు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సర్పంచ్‌లకు స్వేచ్ఛ ఇచ్చి, అన్ని హక్కులు కల్పించామన్నారు.
శాసనసభలో సభ్యులు సత్యదూరమైన విషయాలు మాట్లాడారు అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. పల్లె, పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ కాదు.. దీర్ఘకాలిక చర్చ పెట్టండి అని స్పీకర్‌కు సీఎం విజ్ఞప్తి చేశారు. తాము అన్నది తప్పకుండా చేసి చూపిస్తాం. ఏకగ్రీవమైన గ్రామపంచాయతీలకు నిధులు ఇస్తామని ఎక్కడా చెప్పలేదు. నూతన పంచాయతీరాజ్ చట్టంలో ఆ ప్రస్తావనే లేదు. ఆ చట్టం ప్రకారమే నిధుల పంపిణీ, విడుదల జరుగుతుందన్నారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తుంది.
సర్పంచ్‌లకు సర్వ స్వేచ్ఛ ఇచ్చామన్నారు. సర్పంచ్‌లకు అన్ని హక్కులు కల్పించామన్నారు. పన్నులు వసూలు చేసుకునే బాధ్యతను పంచాయతీలకే అప్పగించాం. గత ప్రభుత్వాల హయాంలో పంచాయతీల్లో అవినీతి జరిగింది. గ్రామాల్లో పరిశుభ్రత కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. వర్షాకాలం వచ్చిందంటే గిరిజన ప్రాంతాల్లో మరణాలు సంభవించేవి. ఇప్పుడు అన్ని సీజనల్ వ్యాధులు, డెంగీ లాంటి విషజ్వరాలు తగ్గిపోయాయి. గ్రామాల రూపురేఖలను మార్చేశామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.