ఇండియన్ వుమెన్స్ టీమ్ ఓపెనర్ స్మృతి మందానా చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా వుమెన్ క్రికెట్ టీమ్‌తో జరుగుతున్న ఏకైక డేనైట్ టెస్ట్ రెండో రోజు ఆమె సెంచరీ బాదింది. దీంతో పింక్ బాల్ టెస్ట్‌లో భారత మహిళల జట్టు తరఫున సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా ఆమె నిలిచింది.
171 బంతుల్లో ఆమె మూడంకెల స్కోరును అందుకుంది. నిజానికి తొలి రోజే ఆమె సెంచరీ చేసేలా కనిపించినా.. వర్షం అడ్డుపడటంతో కేవలం 44 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. దీంతో ఆమె 80 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. రెండో రోజు అదే దూకుడు కొనసాగించిన ఆమె.. ఆట ప్రారంభమైన కాసేపటికే సెంచరీ మార్క్ అందుకుంది.
ఆమె సెంచరీలో 19 ఫోర్లు, ఒక సిక్స్ ఉండటం విశేషం. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌లో ఆమె కొన్ని కళ్లు చెదిరే ఆఫ్‌సైడ్ షాట్లతో అలరించింది. ఈ టెస్ట్ మ్యాచ్ కోసం గత మూడు నెలలుగా తాను పింక్ బాల్‌ను దగ్గర పెట్టుకొని ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు తొలి రోజు ఆట తర్వాత మందాన చెప్పింది. అందుకే తాను ఆ బంతికి అలవాటు పడినట్లు ఆమె తెలిపింది