నిన్నటికి నిన్న తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత రాజకీయ కురువృద్ధుడైన ఒక నేత.. నాగార్జున సాగర్ నియోజకవర్గమే తన అడ్డగా భావించిన జానారెడ్డి అప్పుడే రాజకీయాల్లో ప్రవేశించిన ఓ కుర్రాడి చేతిలో పరాజయాన్ని మూటకట్టుకోవాల్సి వచ్చింది! వారసత్వ రాజకీయాన్ని ఘనంగా చాటుకునే మరో నాయకుడు.. ఓ విద్యార్థి నేతకు లభించిన ప్రజామద్దతు ముందు తలొంచాల్సి వచ్చింది! రాజకీయాల్లో ఢక్కాముక్కీలు తిన్న అనేకమంది.. ఉద్యమ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చినవారి ముందు డీలాపడిన సందర్భాలెన్నో!
ఒకప్పుడు పెద్దపల్లిలో, ఆ తర్వాత అందోల్‌లో, నిన్నటికి నిన్న నాగార్జునసాగర్‌లో కనిపించిన దృశ్యమే ఇప్పుడూ రిపీట్ కాబోతున్నది! అసాధ్యాలను సుసాధ్యంచేసే ముఖ్యమంత్రి కేసీఆర్.. గులాబీ రేసు గుర్రాలను ఎంపిక చేయడంలో వ్యూహం, చతురత అద్భుతాలు చేస్తున్నది! ఏండ్ల తరబడి కట్టుకున్న స్వార్థ రాజకీయ కోటలను బద్దలు కొడుతున్నది! ఇవాళ హుజూరాబాద్ ఉప ఎన్నికలోనూ మరో రికార్డును టీఆర్‌ఎస్ బద్దలు కొట్టబోతున్నది అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో సీఎం కేసీఆర్ నాగార్జునసాగర్ వ్యూహాన్నే అనుసరించారు. నిరుపేద యాదవ కుటుంబానికి చెందిన విద్యార్థి నేత గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను బరిలో దింపారు. టీఆర్‌ఎస్సే తమ అభ్యర్థి, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే తమకు శ్రీరామరక్ష అని హుజూరాబాద్ ప్రజలు నిర్ధారణకు వచ్చారని గులాబీ శ్రేణులంటున్నాయి. తాము టీఆర్‌ఎస్‌నే గెలిపించుకుంటామని, ఈటలను ఇంటికి పంపిస్తామని ప్రజలు బాహాటంగానే తీర్మానిస్తున్నారు.
అభ్యర్థిగా గెల్లును సీఎం కేసీఆర్ ప్రకటించిన నాటినుంచే ఈటల ఇంటికెళ్లుడు ఖాయమనే వాతావరణం నెలకొన్నది. వేల ఎకరాలున్న వ్యక్తి కావాలా? 2 గుంటల భూమి ఉన్న సామాన్యుడు కావాలా? అంటే సామాన్యుడే మాకు మాన్యుడంటున్నారు. సీఎం కేసీఆర్ అవకాశమిస్తేనే ఈటల ఎదిగారని, ఇప్పుడు తన తప్పుల్ని కప్పిపుచ్చుకోవటం కోసం బీజేపీలో చేరిన ఈటలకు ఓటెందుకు వేస్తామని కుండబద్దలు కొడుతున్నారు. సీఎంవ్యూహానికి ఈటల ఇంటికిపోవటం.. గెల్లు అసెంబ్లీకి రావడం ఖాయమని టీఆర్‌ఎస్ శ్రేణులు ధీమా వ్యక్తంచేస్తున్నాయి.