ఇంటర్ ఫస్టియర్ పరీక్షలపై హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రభావం పడనున్నది. పోలింగ్, ఫలితాల వెల్లడి రోజుల్లో ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులకు అక్టోబర్ 25 నుంచి నవంబర్ 2 వరకు ఫస్టియర్ పరీక్షలు జరుగనున్నాయి. పోలింగ్‌కు ముందురోజు అంటే 29న కేంద్రాలను స్వాధీనం చేసుకుంటారు. 30న పోలింగ్, నవంబర్ 2న ఫలితాలు వెల్లడిస్తారు.
ఆ మూడు రోజులు అక్టోబర్ 29న భౌతికశాస్త్రం, అర్థశాస్త్రం, 30న రసాయనశాస్త్రం, వాణిజ్యశాస్త్రం, నవంబర్ 2న మోడ్రన్ లాంగ్వేజి, జియోగ్రఫీ విద్యార్థులకు పరీక్షలు ఉన్నాయి. నియోజకవర్గ పరిధిలోని ఆరు పరీక్ష కేంద్రాల్లో ఈ సమస్య తలెత్తుతున్నట్టు అధికారులు గుర్తించారు. ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టిన అధికారులు.. రెండుమూడు రోజుల్లో ఈ అంశంపై స్పష్టత వస్తుందని తెలిపారు.