తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా మార్గదర్శనం చేస్తున్న టీఆర్‌ఎస్ అంటే ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. బుధవారం కాసేపు మీడియాతో చిట్ చాట్ చేశారు ఈ సందర్భంగా ప్రతిపక్షాల పై మంత్రి అజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దాదాపు ఇప్పటికే 100కుపైగా కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని బేరానికి పెట్టిన బీజేపీ అమ్మకం పార్టీగా మిగిలిపోయిందని వంటగ్యాస్, వంట నూనె, నిత్యావసర సరుకుల ధరలను ఆకాశానికి తీసుకెళ్లిన ఘనత బీజేపీదని మండిపడ్డారు. హుజూరాబాద్‌లో గెలిచేది ముమ్మాటికీ టీఆర్‌ఎస్సేనని.. కాంగ్రెస్, బీజేపీలకు నిమజ్జనం తప్పదని మంత్రి పువ్వాడ చెప్పారు.
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను కేంద్ర ప్రభుత్వంతో పాటు అనేక రాష్ట్రాలు అమలు చేస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. సీఎం కేసీఆర్‌పై ఇష్టమొచ్చినట్టు నోరు పారేసుకుంటే ఊరుకొనేది లేదని హెచ్చరించారు. రాజకీయ ప్రత్యర్థులను కొనుగోలు చేయటంలో బీజేపీని మించిన పార్టీ మరొకటి లేదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు.
రేవంత్ రెడ్డివి పగటి కలలు : మంత్రి పువ్వాడ
రాష్ట్ర రాజకీయాల్లో ఐరన్‌లెగ్‌గా పేరొందిన రేవంత్.. టీడీపీని ఖాళీ చేయించినట్టే కాంగ్రెస్‌నూ ఖతం పట్టిస్తారన్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రేవంత్‌రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్సేనని తేల్చిచెప్పారు. రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికల్లో 2018లో వచ్చిన సీట్ల కన్నా తక్కువే వస్తాయని అన్నారు. రేవంత్ పేరుకే పీసీసీ అధ్యక్షుడు అని పేర్కొన్నారు. చంద్రబాబు చెప్పినట్లు రేవంత్ నడుచుకుంటున్నారని చెప్పారు. రేవంత్ నైజం ఏంటో శశిథరూర్‌పై ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే అర్థమవుతుందన్నారు.
బండి.. నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే : మంత్రి పువ్వాడ
రాష్ర్టాన్ని అభివృద్ధి చేయడంలో సీఎం కేసీఆర్ పోటీ పడుతుంటే.. దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడంలో ప్రధాని మోదీ పోటీ పడుతున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ధ్వజమెత్తారు. దేశంలో మోదీ గ్రాఫ్ 42 శాతానికి పడిపోయిందని చెప్పారు. ప్రభుత్వం పెట్టే ప్రతిపైసా ఖర్చు ను కేంద్ర ప్రభుత్వ సంస్థ కాగ్ తన నివేదికలో చూసుకుంటుందనే విషయం తెలియని అజ్ఞాని బండి సంజయ్ అని ఎద్దేశా చేశారు.