తెలంగాణ రాష్ట్రంలోని హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన సంగతి తెల్సిందే. ఈ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తరపున గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలోకి దిగుతున్నారు. గత కొన్ని నెలలుగా టీఆర్ఎస్ శ్రేణులు నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారం విజయవంతంగా కొనసాగుతుంది. ఇప్పటికి తాము ఏమి చేశాం.. గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపిస్తే తాము ఏమి చేస్తాం అనే పలు అంశాలపై గులాబీ శ్రేణులు నిర్వహిస్తున్న ప్రచారం హుజురాబాద్ ప్రజల్లో చైతన్యాన్ని రేకెత్తించింది.
ఒకవైపు మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన పలు అక్రమాలపై.. భూకుంభకోణాలపై ప్రజలకు వివరిస్తూనే.. మరోవైపు ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే చేయబోయే కార్యక్రమాల గురించి హుజురాబాద్ ప్రజలకు వివరించడంలో టీఆర్ఎస్ పార్టీ విజయవంతమైందనే చెప్పాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులు ఆత్మగౌరవంతో ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న దళితబంధు కార్యక్రమంతో హుజురాబాద్ నియోజకవర్గ దళితులందరూ ఏకపక్షంగా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తామని ఏకగ్రీవ తీర్మానాలు చేయడం ఆ పార్టీ పట్ల దళితులంతా సానుకూలత ఆర్ధమవుతుంది.
మరోవైపు తమ వర్గానికి చెందిన పేదింటి బిడ్డ.. ఉద్యమకారుడు.. స్వరాష్ట్ర సాధనలో భాగంగా అనేక సార్లు జైలుకెళ్లిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించడంతో బీసీ సామాజిక వర్గం అంతా ఏకపక్షంగా టీఆర్ఎస్ కే మద్దతు తెలుప్తుతుంది. అంతేకాకుండా బీసీలు ఆర్థికంగా.. సామాజికంగా జీవించాలనే లక్ష్యంతో గొల్ల కురుమ యాదవ్ లకు గొర్రెల పంపిణీ.. ముదిరాజులకు చేపపిల్లలు పంపిణీలాంటి అనేక కార్యక్రమాలతో బీసీ సామాజిక వర్గం టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు.
సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా చేపడుతున్న అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలే కాకుండా ఆసరా పింఛన్లు,రైతుబంధు,రైతుబీమా,కళ్యాణ లక్ష్మీ,కేసీఆర్ కిట్లు లాంటి అనేక పథకాలతో ప్రజల మదిలో చెరగని ముద్ర వేసుకుంది టీఆర్ఎస్ పార్టీ.సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల ఫలాలు ప్రతి గడపకు చేరుతుండటంతో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని.. గెల్లు శ్రీనివాస్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొంది అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.