హుజూరాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లో నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఏర్పాట్లపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొవిడ్ నిబంధనల మేరకు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కేవలం మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచారంలో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అయితే ఎన్నికల ప్రచారంలో రోడ్ షోలు, బైక్ ర్యాలీలకు అనుమతి లేదన్నారు. పోలింగ్‌కు 72 గంటల ముందే ప్రచారం ముగించాలని చెప్పారు. ఎన్నికల నియామవళికి సంబంధించి సంబంధిత కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. కొవిడ్ నిబంధనలను అధికారులు కఠినంగా అమలు చేయాలని శశాంక్ గోయల్ ఆదేశించారు.
ఈవీఎంలు పరిశీలించాం.. మొత్తం ఓటర్లు 2,36,430
అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో ఈవీఎంలను ఇప్పటికే పరిశీలించామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ స్పష్టం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 305 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 47 పోలింగ్ కేంద్రాల్లో వెయ్యి కంటే ఎక్కువ ఓటర్లు ఉన్నారు. వయోవృద్ధులకు, దివ్యాంగులకు, కొవిడ్ రోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తామన్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో 2,36,430 మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో పురుష ఓటర్లు 1,17,552, మహిళ ఓటర్లు 1,18,716 మంది ఉన్నారు. ఎన్ఆర్ఐ ఓటర్లు 14 మంది ఉండగా, సర్వీస్ ఓటర్లు 147, ట్రాన్స్ జెండర్ ఒకరు ఉన్నారు.
త్వరలోనే ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ
ఈ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ కూడా త్వరలోనే ఉంటుంది అని శశాంక్ గోయల్ స్పష్టం చేశారు. మిగత రాష్ట్రాల్లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాల్సి ఉంది కాబట్టి అన్ని రాష్ట్రాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటారు అని పేర్కొన్నారు.