హైదరాబాద్‌లో చేపట్టిన వ్యూహాత్మక రహదారి అభివృద్ధి ప్రాజెక్టు ప్రస్తుత దశపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఈ ప్రాజెక్టును ప్రారంభించామని తెలిపారు. ఎస్ఆర్డీపీ కింద ఇప్పటికే రూ . 19వందల 46కోట్ల 90లక్షలతో 22 పనులు పూర్తి చేశామన్నారు. ఎస్ఆర్డీపీ కింద రూ. 5,693 కోట్ల 51 లక్షల వ్యయంతో 24 పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.
ఎస్ఆర్డీపీ కింద అనేక ప్రాజెక్టులు చేపట్టాం. భవిష్యత్‌లో హైదరాబాద్ ఒక విశ్వనగరంగా అవతరించాలనేది సీఎం కేసీఆర్ ఆకాంక్ష. దానికనుగుణంగా ఆలోచనతో, ప్రణాళికబద్దంగా ముందుకు వెళ్తున్నాం. అధునాతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగుతోంది. టీడీఆర్ తో జీహెచ్ఎంసీకి రూ. 3 వేల కోట్లు ఆదా చేయడం జరిగిందన్నారు. భారతదేశంలోనే మొదటిసారిగా టీడీఆర్ బ్యాంకును ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఎస్ఆర్డీపీలో భాగంగా కేబుల్ బ్రిడ్జితో పాటు ఫ్లై ఓవర్, అండర్ పాస్‌లు నిర్మించామన్నారు. ఇందిరా పార్క్ వద్ద స్టీల్ బ్రిడ్జి నిర్మాణం సాగుతోందన్నారు.
సౌత్ జోన్‌లో ఓవైసీ ఫ్లై ఓవర్ 93.6 కోట్లు, బహదూర్‌పురా ఫ్లై ఓవర్‌ను 106 కోట్లతో, చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్‌ను 41 కోట్ల 55 లక్షలతో, నల్లగొండ క్రాస్ రోడ్డు టు ఓవైసీ జంక్షన్ 523 కోట్లతో, ఫలక్‌నూమా ఆర్వోబీ రూ. 52 కోట్లతో, శాస్త్రిపురం ఆర్వోబీ రూ. 91 కోట్లు, ఆరాంఘర్ టు జూపార్క్ ఫ్లై ఓవర్ రూ. 636 కోట్లతో వివిధ దశల్లో పనులు కొనసాగుతున్నాయి. లింక్ రోడ్లను ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు.