గులాబ్ తుఫాను త్రీవ వాయుగుండంగా మారింది. అది తెలంగాణ మీదుగా కేంద్రీ కృతమై ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వచ్చే 24 గంటల్లో గంటకు 30 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీసింది.
త్రీవవాయుగుండం, అల్పపీడన ప్రభావంతో రానున్న 24 గంటల్లో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. రానున్న 4 నుంచి 5 గంటల్లో హైదరాబాద్ అతిభారీ వర్షం కురుస్తుందని తెలిపింది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉదని హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ సీఎండీ అన్నమనేని గోపాల్ రావు ఆదేశించారు. ప్రజలంతా విద్యుత్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని, విద్యుత్ వైర్లు తెగిన, ఎలాంటి విద్యుత్ సంబంధిత సమస్య లకైనా సంబంధిత సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూమ్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 18004250028, 1912కి తెలియచేయాలని కోరారు.