గంజాయి అక్రమ రవాణాపై పటిష్ట నిఘా పెట్టడం ద్వారా నల్గొండ జిల్లా పరిధిలో జాతీయ రహదారిపై 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డిఐజి ఏ.వి. రంగనాధ్ తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టిన క్రమంలో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో జిల్లా పరిధిలో ఉన్న జాతీయ రహదారి – 65పై నిరంతరాయంగా నిర్వహిస్తున్న వాహనాల తనిఖిలలో ఒక ఆర్టీసీ బస్సులో 20 కిలోలు, ఒక కారులో తరలిస్తున్న 100 కిలోల గంజాయి మొత్తం 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠా రూటు మార్చి ప్రైవేట్ వాహనాలలో కాకుండా ఆర్టీసీ బస్సులలో మహిళలతో కలిసి ప్రయాణికుల ముసుగులో గంజాయిని తరలిస్తున్నారని ఆయన వివరించారు. తాజాగా జాతీయ రహదారిపై పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా భద్రాచలం డిపోకు చెందిన రాజధాని డీలక్స్ బస్సును కట్టంగూర్ – నల్లగొండ క్రాస్ రోడ్డు వద్ద తనిఖీ నిర్వహించగా ఒరిస్సాకు చెందిన మహిళ సుమిత్ర సర్కార్, ఇద్దరు పురుషులు సుజిత్ బిస్వాస్, అమల్ పొద్దార్ భద్రాచలం మీదుగా 20 కిలోల గంజాయితో హైదరాబాద్ కు తరలిస్తూ పట్టుపడినట్లు తెలిపారు. ఈ కేసులో మరో ఇద్దరు వ్యక్తులకు సంబంధం ఉన్నట్లుగా విచారణలో తేలింది, వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని ఆయన తెలిపారు.
అదే విధంగా మరో కేసులో 100 కిలోల గంజాయిని ఆంధ్రా – ఒరిస్సా సరిహద్దు నుండి మహారాష్ట్ర లాతూర్ కు తరలిస్తుండగా జాతీయ రహదారి – 65 పై వాహన తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో కట్టంగూర్ సమీపంలో పట్టుకున్నట్లు డిఐజి తెలిపారు. భద్రాచలం ప్రాంతానికి చెందిన ప్రభు భజన్ వద్ద గంజాయి కొనుగోలు చేసి హ్యుండయి ఐ-20 కారు *(MH 05 CM 2371)* వాహనంలో భద్రాచలం నుండి నల్లగొండ జిల్లా మీదుగా హైదరాబాద్, అక్కడి నుండి మహారాష్ట్రలోని లాతూర్ కు గంజాయి తీసుకువెళ్తున్నట్లు చెప్పారు. కారులో సులేమాన్ ఇలియాస్ సయ్యద్, మహబూబ్ దంగ్డే లు 100 కిలోల గంజాయితో పట్టుబడ్డారని, గంజాయితో పాటు ఐ-20 కారు సీజ్ చేసినట్లు ఆయన చెప్పారు. మహారాష్ట్రలోని లాతూర్ కు చెందిన ఇద్దరు మహిళలు అనసూయ వినాయక దూబే, పార్వతి నివర్తి జాదవ్, మరో ముగ్గురు పురుషులు దేవరాజ్ కామ్డే, సయ్యద్ హుస్సేన్ నాజర్, సోంనాధ్ దత్ జాదవ్ లకు ఈ కేసుతో సంబంధం ఉన్నట్లుగా గుర్తించామని ఆయన తెలిపారు. గంజాయి అక్రమ రవాణా సమూలంగా అరికట్టడం లక్ష్యంగా పెద్ద ఎత్తున పటిష్ట నిఘా పెట్టడంతో పాటు నిరంతరాయంగా జాతీయ రహదారులతో పాటు జిల్లాలోని అన్ని రహదారులు, అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహనాల తనిఖీలు చేస్తున్నామని చెప్పారు. గంజాయి రవాణాతో పాటు వారు ఎక్కడి నుండి తీసుకువస్తున్నారు, ఎవరికి విక్రయిస్తున్నారనే కోణాలలో సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
సిసి కెమెరాల పర్యవేక్షణలో వాహనాల తనిఖీలు
జాతీయ రహదారిపై నిర్వహిస్తున్న వాహనాల తనిఖీలు మొత్తం సిసి కెమెరాల పర్యవేక్షణలోనే జరిగిందని చెప్పారు. సామాజిక మాధ్యమాలు, కొన్ని మీడియాలలో జగ్గయ్యపేట శాసనసభ్యుడు కుమారుడిని కట్టంగూర్ వద్ద నిర్వహించిన వాహనాల తనిఖీ, గంజాయి కేసులో అదుపులోకి తీసుకొని విడిచిపెట్టినట్లుగా అసత్య ప్రచారాలు వస్తున్నాయని అవన్నీ అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేయవద్దని ఆయన సూచించారు. మొత్తం వాహనాల తనిఖీ సిసి కెమెరాల పర్యవేక్షణలో జరిగిందని, ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉంటే పోలీసులను సంప్రదిస్తే సిసి కెమెరా ఫుటేజ్ సైతం చూపిస్తామని ఆయన స్పష్టం చేశారు.
గంజాయి రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం
నల్లగొండ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చడం లక్ష్యంగా నిరంతరం పని చేస్తున్నామని, గంజాయి మత్తుకు బానిసలుగా మారి యువత వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటూ ఆ మత్తులో అనేక అసాంఘిక కార్యకలాపాలు, నేరాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. గంజాయికి సంబంధించిన ఎలాంటి సమాచారం తెలిసినా ప్రజలు సామాజిక బాద్యతతో పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. డయల్ 100 ద్వారా, సంబందిత పోలీస్ స్టేషన్లలో, పోలీస్ అధికారులకు ఫోన్ ద్వారా, మెసేజ్ రూపంలో సమాచారం ఇవ్వాలని గంజాయి మత్తులో యువత జీవితాలు నాశనం కాకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉన్నదని, ప్రజలందరూ సామాజిక బాధ్యతతో పోలీసులకు సహకరించాలని ఆయన జిల్లా ప్రజలను కోరారు.
ఈ రెండు కేసులలో నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి నేతృత్వంలో సమర్ధవంతంగా పనిచేసిన శాలి గౌరారం సిఐ పి.ఎన్.డి. ప్రసాద్, నకిరేకల్ సిఐ నాగరాజు, కట్టంగూర్ ఎస్.ఐ. శివ ప్రసాద్, పోలీస్ సిబ్బందిని డిఐజి రంగనాధ్ ప్రత్యేకంగా అభినందించారు.
Tags crime crime news drugs nalgonda slider telanganacm telanganacmo telanganagovernament trsgovernament