ఏపీ ప్రభుత్వం అనుమతుల్లేకుండా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల మహబూబ్‌నగర్ జిల్లాకు తీరని నష్టం వాటిల్లుతుందని, వెంటనే ఆ ప్రాజెక్టును నిలిపివేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు విజ్ఞప్తిచేశారు. తాము చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతులివ్వాలని కోరారు.
కేంద్రమంత్రితో సీఎం కేసీఆర్ శనివారం ఢిల్లీలో భేటీ అయ్యారు. తెలంగాణ సాగునీటి పారుదలకు సంబంధించిన అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం, కృష్ణా జలాల వినియోగంపై ఏపీతో నెలకొన్న వివాదాలు, అందుకు కారణాలను, వాస్తవ పరిస్థితులను వివరించారు. అదేవిధంగా కరువు ప్రాంతమైన పాలమూరును సస్యశ్యామలం చేయడానికి, ఫ్లోరైడ్ ప్రాంతాలకు తాగునీటిని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతులివ్వాలని విజ్ఞప్తిచేశారు.
ఆ ప్రాజెక్టుకు కృష్ణాలో నికర జలాలు కేటాయించాలని కోరారు. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల అధికార పరిధిని నిర్దేశిస్తూ ఇటీవల విడుదలచేసిన గెజిట్ అమలును బ్రిజేశ్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులను చేసేంతవరకూ వాయిదా వేయాలని కేంద్ర మంత్రికి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
ఇరు రాష్ర్టాలు ఉమ్మడిగా వినియోగించుకుంటున్న ప్రాజెక్టులను మాత్రమే రివర్ బోర్డుల పరిధిలోకి తేవాలని, మిగిలిన వాటిని గెజిట్‌లో నుంచి మినహాయించాలని కోరారు. కేంద్ర మంత్రిని కలిసిన సీఎం కేసీఆర్ వెంట పాలమూరు ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వరరెడ్డి, రాజేందర్‌రెడ్డి, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఉన్నారు.