పంజాబ్ కాంగ్రె్‌సలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్‌సింగ్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. పంజాబ్ అసెంబ్లీకి మరో నాలుగు నెలల్లోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం పదవి నుంచి అమరీందర్ వైదొలగడం ప్రాధాన్యం సంతరించకుంది.
అయితే పార్టీలో అవమానాలు భరించలేకే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు అమరీందర్‌సింగ్ ప్రకటించారు. ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశం జరగనుండగా.. అంతకుముందే ఆయన రాజీనామా చేశారు. ఉదయమే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో మాట్లాడానని, రాజీనామా గురించి ఆమెతో చెప్పానని అన్నారు. ‘‘ఎమ్మెల్యేలను ఇప్పటికే రెండుసార్లు ఢిల్లీకి పిలిపించుకున్నారు. తాజాగా సీఎల్పీ సమావేశం నిర్వహిస్తున్నారు. నేను ప్రభుత్వాన్ని నడపలేననే అనుమానం అధిష్ఠానానికి ఉండాలి.
లేదా మరేదైనా కారణం ఉండి ఉండాలి’’ అని అమరీందర్ అన్నారు. భవిష్యత్తు కార్యాచరణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానన్నారు. కాగా, పంజాబ్ కాంగ్రె్‌సలో గత కొన్నాళ్లుగా వర్గ పోరు కొనసాగుతోంది. నవజోత్‌సింగ్ సిద్ధూకు పీసీసీ అధ్యక్ష పదవి దక్కకుండా అడ్డుకునేందుకు సీఎం అమరీందర్‌సింగ్ తుది దాకా ప్రయత్నించారు. కానీ, అధిష్ఠానం ఆయన మాట వినకుండా సిద్ధూకే పార్టీ పగ్గాలు అప్పగించింది.తాజాగా శనివారం సుమారు 50 మంది ఎమ్మెల్యేలు అమరీందర్‌పై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తూ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాశారు. దీంతో అధిష్ఠానం ఆదివారం సీఎల్పీ అత్యవసర సమావేశం నిర్వహించాలని ఆదేశించింది. ఈ బాధ్యతలను రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జి హరీశ్ రావత్‌కు అప్పగించింది.