Home / SLIDER / తెలంగాణలో మరో భారీ పెట్టుబడి

తెలంగాణలో మరో భారీ పెట్టుబడి

చిన్నపిల్లల వస్ర్తాల ఉత్పత్తిలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ కిటెక్స్‌ మనరాష్ట్రంలో తన పెట్టుబడిని రెండింతలు చేసింది. రూ.2,400 కోట్ల పెట్టుబడితో వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్కు, రంగారెడ్డి జిల్లా చందన్‌వెల్లిలోని సీతారామపురంలో కర్మాగారాలను వచ్చే ఏడాది ప్రారంభించనున్నది. కంపెనీల స్థాపన కోసం రాష్ట్రప్రభుత్వంతో శనివారం హైదరాబాద్‌లోని తాజ్‌ కృష్ణ్ణ హోటల్‌లో పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకొన్నది. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ కిటెక్స్‌ రాకతో ప్రపంచవ్యాప్తంగా అనేకమంది పెట్టుబడిదారులు తెలంగాణవైపు చూస్తున్నారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఎంతటి అనుకూల పరిస్థితులు, విధానాలు ఉన్నాయనేందుకు కిటెక్స్‌ పెట్టుబడే ఉదాహరణ అని పేర్కొన్నారు. కిటెక్స్‌ పరిశ్రమ వల్ల రాష్ర్టానికి బహుళ ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. రాష్ర్టానికి పన్నుల రూపంలో భారీగా ఆదాయం రావడంతోపాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 వేలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. 3 లక్షల ఎకరాల్లో పండే మేలిమిరకం పత్తిని ఈ సంస్థ కొనుగోలు చేస్తుందని, తద్వారా రైతులకు పెద్దఎత్తున ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. 80-90 శాతం మహిళలకే ఉద్యోగాలు కల్పిస్తారు కాబట్టి పెద్ద సంఖ్యలో మహిళలు స్వయంసమృద్ధి సాధిస్తారని చెప్పారు. మంత్రి కేటీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే..

మన రాష్ర్టానికి ఇలా వచ్చింది

కిటెక్స్‌ రాక గురించి మీకు చెప్పాలి. ఒక సోమవారం ఉదయం నేను పేపర్‌ చదువుతూ కిటెక్స్‌ గ్రూపు కేరళ నుంచి తమ రూ.3,500 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకొని ఇతర ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించినట్టు వార్త చూశాను. వెంటనే పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌కు ఫోన్‌ చేసి కిటెక్స్‌ ఎండీ సాబూ జాకబ్‌తో మాట్లాడాలనుకొంటున్నట్టు చెప్పాను. సాయంత్రానికి ఆయన జాకబ్‌ నంబర్‌ నాకు పంపారు. నేను తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావునని, మీతో మాట్లాడాలనుకొంటున్నట్టు జాకబ్‌కు మెసేజ్‌ పెట్టాను. మొదట ఆయన నా మెసేజ్‌కి స్పందించలేదు. దాంతో ఆయనకు ఇష్టంలేదో లేక ఎవరైనా మంత్రి వద్ద ఉన్నారేమో అనుకొన్నా. తర్వాత జయేశ్‌రంజన్‌ ఆయనకు ఫోన్‌చేసి కేటీఆర్‌ మీతో మాట్లాడాలనుకొంటున్నారని సమాచారం ఇచ్చారు. తర్వాత నేను, జయేశ్‌రంజన్‌, జాకబ్‌ కాన్ఫరెన్స్‌ కాల్‌లో మాట్లాడుకొన్నాం. అదే నేను మొదటిసారి జాకబ్‌తో మాట్లాడింది. రాష్ట్రంలో ఈవోడీబీ, పారిశ్రామిక అనుకూల విధానాలు, పరిశ్రమలశాఖ కల్పిస్తున్న ఇతర ప్రయోజనాలను ఆయనకు వివరించాను.

ఫ్లైట్‌ ఎక్కేవరకు ప్రకటించొద్దని చెప్పా

– Advertisement –

మొదట జాకబ్‌ తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. అప్పటికే ఆయన చాలా రాష్ర్టాల మంత్రులతో మాట్లాడి ఉన్నందున మనల్ని కూడా వారిలాగే కేవలం మాటలు చెప్తున్నామనుకొన్నారు. దాంతో నేను ఆయనతో ఒక్కటే చెప్పాను. ఫోన్‌లో మాట్లాడటంకన్నా ఒకసారి మీరు హైదరాబాద్‌ వచ్చి ఇక్కడి పరిస్థితులు చూడండి అన్నాను. కొవిడ్‌ ఉన్నదని, ఈ పరిస్థితుల్లో ఫ్లైట్స్‌ కూడా సరిగా అందుబాటులో లేవని ఆయన అనడంతో ప్రత్యేక విమానాన్ని పంపుతామని, మీ బృందంతో రావాలని కోరాను. ఆయన మీరు నిజంగా సీరియస్‌గా ఉన్నారా? నేను కేరళలో ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించవచ్చా అని అడిగారు. ప్రకటించవచ్చు కానీ మీరు హైదరాబాద్‌కు ఫ్లైట్‌ ఎక్కేముందు మాత్రమే మీడియాకు చెప్పండి.. లేదంటే అక్కడి ప్రభుత్వం మిమ్మల్ని ఇక్కడికి రానివ్వకపోవచ్చు అని అన్నాను. దాంతో ఆయన ఇక్కడికి వచ్చేవరకు ప్రకటన చేయలేదు.

చూద్దామని వచ్చి..

సోమవారం ప్రక్రియ మొదలుపెడితే శుక్రవారం జాకబ్‌ తన బృందంతో ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకొన్నారు. గంటన్నరపాటు మాతో చర్చించి హెలికాప్టర్‌లో వరంగల్‌లోకి కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు వెళ్లి వచ్చిన తరువాత ఇక్కడ పరిశ్రమ పెట్టనున్నట్టు జాకబ్‌ ప్రకటించారు. ఇక్కడ లభించిన ప్రభుత్వ ఆతిథ్యం, విధానా లు, అధికారుల తీరు చూసి వెంటనే రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టి 4,000 ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు. నాతో, అధికారులతో మాట్లాడాక ఆయనకు నమ్మకం ఏర్పడింది. మరుసటిరోజు రంగారెడ్డి జిల్లా చందన్‌వెల్లి, సీతారామపురం వెళ్లి వచ్చారు. సెకండ్‌ లోకేషన్‌ కూడా నచ్చిందని చెప్పారు. అనంతరం కేరళ వెళ్లిపోయి ఆలోచించుకొని 15 రోజుల తరువాత మళ్లీ వచ్చారు. ఇక్కడి పరిస్థితులు తనకు ఎంతగానో అనుకూలంగా ఉన్నాయని చెప్పి వరంగల్‌, సీతారామపురంలో రూ.2,400 కోట్ల పెట్టుబడితో రెండుచోట్ల పరిశ్రమలు స్థాపిస్తామని చెప్పారు. నేరుగా 22,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని, అందులో 80-90 శాతం మహిళలే ఉంటారని, పరోక్షంగా 18,000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఈ సంస్థలో ఉద్యోగాలంటే ఆషామాషీ కాదు. సామాజిక భద్రతతో, ఉన్నతస్థాయి జీవన ప్రమాణాలతో ఉద్యోగాలు కల్పిస్తుంది.

హామీలిచ్చి ఊరుకొనే ప్రభుత్వం కాదు

ఇతరులలాగ మేము ప్రకటనలు, హామీలకు పరిమితం కాము. ఒప్పందం జరిగినప్పటినుంచి ఉత్పత్తి ప్రారంభమయ్యేవరకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం. ఇప్పటికే మిషన్లకు ఆర్డర్‌ కూడా ఇచ్చారు. వచ్చే ఏడాది నవంబర్‌ నాటికి వరంగల్‌లో ఉత్పత్తి ప్రారంభమవుతుంది. కంపెనీకి ఎలాంటి ఇబ్బంది కలుగదు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు అండగా ఉంటారు. ప్రభుత్వపరంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతాం. అనుమతులన్నీ వేగంగా మంజూరుచేస్తాం.

తెలంగాణపై పెట్టుబడిదారుల్లో విశ్వాసం ఏర్పడింది. ఇక్కడికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలిరావడమే ఇందుకు నిదర్శనం. తాజాగా ఆభరణాల తయారీ సంస్థ మలబార్‌ గ్రూపు రూ.750 కోట్ల పెట్టుబడితో 2,400 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకొచ్చింది. రూ.887 కోట్ల పెట్టుబడితో మూడు జూట్‌ పరిశ్రమలు కూడా త్వరలో ఏర్పాటుకానున్నాయి. కిటెక్స్‌ రాకతో టెక్స్‌టైల్‌ రంగం మరింత ముందుకు వెళ్లేందుకు అవకాశం ఏర్పడింది. ఈ సంస్థ ఏటా మూడు మిలియన్‌ వస్ర్తాలు (పీసెస్‌) తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నందున ఇందుకోసం 3 లక్షల ఎకరాల్లో నాణ్యమైన పత్తిని పండించాల్సి ఉంటుంది. కేరళకుచెందిన చాలామందికి హైదరాబాద్‌ తెలంగాణలో ఉందా? ఆంధ్రప్రదేశ్‌లో ఉందా? అనే సందేహం ఉన్నదని మిత్రులు నాతో చెప్పారు. కిటెక్స్‌ రాకతో ఆ సందేహం తీరిపోతుంది అని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

మేం ఇక్కడికి రావడానికి కేటీఆరే కారణం: సాబూ జాకబ్‌

తాము తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి మంత్రి కేటీఆరే కారణమని కిటెక్స్‌ సంస్థ ఎండీ సాబూ జాకబ్‌ తెలిపారు. ‘మాది చిన్న పిల్లల బట్టల తయారీ సంస్థ. ప్రస్తుతం ఏటా ఒక మిలియన్‌ పీసెస్‌ అమెరికాకు ఎగుమతి చేస్తున్నాం. కేరళ నుంచి ఎగుమతి చేసిన కిటెక్స్‌ బట్ట తొడగని చిన్నారి అమెరికాలో లేదంటే అతిశయోక్తి కాదు. కేరళ నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నాక రాష్ర్టాల నుంచి మాకు ఆహ్వానాలు వచ్చాయి. ఇతర దేశాలనుంచి కూడా ఆహ్వానాలు అందాయి. నేను ఇక్కడికి రావడానికి ఒకే ఒకవ్యక్తి కారణం. ఆయనే మంత్రి కేటీ రామారావు. నన్ను తెలంగాణకు ఆహ్వానించిన మొదటి వ్యక్తి. నేను ఆయన్ను కలిసిన తరువాత మీకు పెట్టుబడులు కావాలా? ఉద్యోగాలు కావాలా? అని అడిగాను. ఆయన వెంటనే ఉద్యోగాలు కావాలన్నారు. రాష్ట్ర ప్రజలపట్ల వారికున్న కమిట్‌మెంట్‌ నాకు బాగా నచ్చింది. మేము ఫైబర్‌ నుంచి ఫినిషింగ్‌ వరకు అన్నీ తయారుచేస్తాం. 3 మిలియన్‌ పీసెస్‌ తెలంగాణ నుంచి అమెరికాకు ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. తెలంగాణలో తయారైన కిటెక్స్‌ బట్టలు వేయని బేబీ ప్రపంచంలో ఉండని రోజు వస్తుం ది. ఏ వ్యాపారి అయినా, పెట్టుబడిదారుడైనా తక్కువ రేటుకు కార్మికులు, తక్కువ వ్యయంతో ప్లాంటు ఏర్పాటు కోసం చూస్తారు. మేము అలా కాదు. ఇక్కడికి కేవలం వ్యాపారం కోసం రాలేదు. ఒక పెట్టుబడిదారుగా మేము కూడా లాభాలు ఆశించవచ్చు. కానీ దేశంపట్ల మాకు కమిట్‌మెంట్‌ ఉన్నది. స్థానిక ప్రభుత్వానికి సహకరించడంతోపాటు స్థానికులకు ఉద్యోగాలు కల్పించడం, వారి సంక్షేమం చూడటం మా బాధ్యత. శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పిస్తాం. మొత్తం 22,000 మందికి పీఎఫ్‌, ఈఎస్‌ఐ, మెడికల్‌ సౌకర్యం, సోషల్‌ సెక్యూరిటీ ఏర్పాటుచేస్తాం. మా సంస్థలో పీపీఈ కిట్లు కూడా తయారు చేస్తున్నాం. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీ కింద రాష్ట్రప్రభుత్వానికి రూ.6 కోట్ల విలువైన 1.50 లక్షల పీపీఈ కిట్లను అందిస్తున్నాం’ అని వివరించారు.

ఆజంజాహీ మిల్లు లేని లోటు తీరుతుంది.: ఎర్రబెల్లి దయాకర్‌రావు

కిటెక్స్‌ రాకతో వరంగల్‌లో అజంజాహీ మిల్లు లేని లోటు తీరుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కిటెక్స్‌ రావడం వరంగల్‌వాసుల అదృష్టమన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ వల్లనే ఇది సాధ్యమైందని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, కాలె యాదయ్య, వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat