గత కొంతకాలంగా తెలుగు చిత్రసీమలో రీమేక్ సినిమాల సంస్కృతి పెరిగింది. ఇతర భాషల్లో విజయవంతమైన సినిమాల్ని తెలుగులో రీమేక్ చేసేందుకు అగ్రహీరోలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఈ బాటలో అడుగులు వేస్తూ నితిన్ నటించిన చిత్రం మాస్ట్రో. బాలీవుడ్‌లో విజయవంతమైన అంధాధూన్ చిత్రానికి రీమేక్ ఇది. కరోనా మహమ్మారితో పాటు థియేటర్స్‌లో నెలకొన్న సమస్యల మూలంగా ఓటీటీ ద్వారా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై ఎన్.సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి నిర్మించారు. ఈ సినిమాతో ఓటీటీలో తొలి అడుగు వేసిన నితిన్‌కు శుభారంభం దక్కిందా?ఈ రీమేక్ తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగిందా?లేదా?అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే….
అరుణ్(నితిన్) ఓ పియానో ప్లేయర్. సంగీత పోటీల్లో గెలవాలన్నది అతడి ఆశయం. కంటిచూపు లేకపోవడం వల్ల సంగీతంపై ఎక్కువగా దృష్టిపెట్టవచ్చనే ఆలోచనతో గుడ్డివాడిగా నటిస్తుంటాడు. తన సంగీతసాధనతో పాటు జీవనోపాధి కోసం ఓ రెస్టారెంట్‌లో పియానో ప్లేయర్‌గా పనిచేస్తుంటాడు. ఆ రెస్టారెంట్ యజమాని కూతురు సోఫీతో(నభానటేష్) అరుణ్‌కు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది. ఆ రెస్టారెంట్‌కు తరుచుగా వచ్చే సీనియర్ సినీ హీరో మోహన్(నరేష్)…అరుణ్ సంగీతానికి అభిమానిగా మారిపోతాడు. తన భార్య సిమ్రాన్(తమన్నా) పుట్టినరోజు సందర్భంగా ఆమెను సర్‌ప్రైజ్ చేయడం కోసం అరుణ్‌తో ఓ స్పెషల్ మ్యూజిక్ కాన్సెర్ట్ ప్లాన్ చేస్తాడు. మోహన్ ఇంట్లో అడుగుపెట్టిన అరుణ్‌కు అతడు చనిపోయి ఉండటం కనిపిస్తుంది. తన ప్రియుడితో(జిషుసేన్‌గుప్తా) కలిసి మోహన్‌ను సిమ్రాన్ చంపిందనే విషయాన్ని అరుణ్ గ్రహిస్తాడు. వారిపై పోలీస్ కైంప్లెంట్ ఇవ్వాలని అనుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి?అరుణ్ గుడ్డివాడు కాదనే నిజాన్ని తెలుసుకున్న సిమ్రాన్‌తో పాటు ఆమె ప్రియుడు అతడిని చంపేందుకు ఎలాంటి ప్లాన్ వేశారు?సిమ్రాన్ ప్రియుడు ఎవరు? వారి పన్నాగాల్ని అరుణ్ తిప్పికొట్టగలిగాడా? అపార్థాలతో దూరమైన ప్రియురాలు సోఫీని మళ్లీ కలుసుకోగలిగాడా?లేదా అన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.
ఇతర భాషలతో పోలిస్తే డార్క్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు తెలుగులో తక్కువే రూపొందాయి. ఆ నమ్మకంతోనే బాలీవుడ్‌లో విజయవంతమైన అంధాధూన్ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి చిత్రబృందం నిర్ణయించుకున్నారు. సింపుల్ కథను తెలివైన స్క్రీనేప్లేతో బాలీవుడ్ దర్శకుడు విభిన్నంగా తీర్చిదిద్దాడు. అదే సినిమాను కల్ట్ క్లాసిక్‌గా నిలబెట్టింది. రీమేక్ విషయంలో తెలుగు దర్శకనిర్మాతలు అదే ఫార్ములాను అనుసరించారు. కామెడీ ట్రాక్‌లు, కమర్షియల్ హంగులు, మార్పుల జోలికి పోకుండా రీమేక్‌లోని ఆత్మను యథాతథంగా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.
అంధుడిగా అరుణ్‌కు ఎదురయ్యే సమస్యలు, సోఫీతో అతడి పరిచయం, ప్రేమాయణంతో సినిమాను మొదలుపెట్టారు దర్శకుడు. ఆ సన్నివేశాలు ఆహ్లాదభరితంగా సాగుతాయి. మోహన్ ఇంట్లో అరుణ్ అడుగుపెట్టడంతో అసలు కథ మొదలవుతుంది. మోహన్ హత్యకు ప్రత్యక్షసాక్షిగా అతడు నిలవడం, తాను అంధుడనే భ్రమలో ఉన్న సిమ్రాన్ అతడి కళ్ల ముందే డెడ్‌బాడీని మాయం చేసేందుకు ప్రయత్నించడం లాంటి సన్నివేశాలు ఉత్కంఠను పంచుతాయి. అరుణ్ అంధుడు కాదనే నిజాన్ని సిమ్రాన్ తెలుసుకునే ఎపిసోడ్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. అరుణ్ నటనను సిమ్రాన్ నిజం చేయడంతో కథ కొత్త మలుపు తిరుగుతుంది. సిమ్రాన్ నిజస్వరూపాన్ని అందరికి తెలియజేయడం కోసం అరుణ్ పడే తపన, ఇందుకోసం ఓ డాక్టర్‌తో పాటు ఆటోడ్రైవర్, లాటరీ టికెట్స్ అమ్మే యువతి సహాయాన్ని తీసుకునే సన్నివేశాలతో ద్వితీయార్థాన్ని దర్శకుడు ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దారు. తాను చేసిన తప్పులకు సిమ్రాన్ ఎలా మూల్యం చెల్లించుకున్నదనేది పతాక ఘట్టాల్లోవిభిన్నంగా చూపించారు. ైక్లెమాక్స్ ఎపిసోడ్‌లో వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది.
హీరో పాత్ర ప్రధానంగానే ఈ కథ సాగుతుంది. క్లిష్టమైన పాత్రలో నితిన్ చక్కటి నటనను కనబరిచారు. మాతృకలో నటించిన ఆయుష్మాన్ ఖురానా ప్రభావం కనిపించకుండా తనదైన శైలి ఎనర్జీ, మేనరిజమ్స్‌తో పాత్రలో ఇమిడిపోయారు. గుడ్డివాడిగా నటించే సన్నివేశాల్లో జోవియల్‌గా కనిపించారు. నిజంగానే కంటిచూపు కోల్పోయే పరిస్థితులు ఎదురైనప్పుడు చక్కటి భావోద్వేగాల్ని పలికించారు. నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలో తమన్నా నటన బాగుంది. హిందీలో టబు ఈ పాత్రలో అద్వితీయ అభినయాన్ని కనబరిచి సినిమాను నిలబెట్టింది. ఆమె స్థాయిలో తమన్నా నటించకపోయినా పాత్రకు న్యాయం చేసేందుకు కష్టపడింది. ఆమె సొంత డబ్బింగ్ కొంత ఇబ్బంది పెట్టింది. నభానటేష్ క్యారెక్టర్‌కు పెద్దగా ప్రాధాన్యత లేదు. జిషుసేన్‌గుప్తా, నరేష్, హర్షవర్ధన్ తమ పరిధుల మేర నటించారు. గాయని మంగ్లీ ఈ సినిమాతో నటిగా పరిచయమైంది.తెలంగాణ యాసతో రచ్చ రవి, మంగ్లీ కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
రీమేక్ సినిమాను తెరకెక్కించడం దర్శకులకు కత్తిమీద సాములాంటిదే. ఉన్నది ఉన్నట్లు చేస్తే కాపీపేస్ట్ చేశారని అంటారు. మార్పులు చేస్తే మంచి కథను చెడగొట్టారనే విమర్శలొస్తాయి. ఆ రెండు అంశాల్ని దృష్టిలో పెట్టుకున్న దర్శకుడు జాగ్రత్తగా సినిమాను తెరకెక్కించారు. కథకు అవసరమైన చిన్న చిన్న మార్పుల మాత్రమే చేశారు. కొత్త పాత్రలు, సీన్స్ సినిమాలో కనిపించవు. ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు మహతి స్వరసాగర్ నేపథ్య సంగీతం, యువరాజ్ ఛాయాగ్రహణం ప్లస్ అయ్యింది. గోవాలో సినిమాను చిత్రీకరించారు. అవన్నీ కొత్త ఫీల్‌ను తీసుకొచ్చాయి. థియేటర్ ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తే ఈ సినిమాకు ఎలాంటి ఆదరణ లభించి ఉండేదో తెలియదు. ఓటీటీలో విడుదలకావడంతో కుటుంబమంతా కలిసి చూసే వెసులుబాటు దొరికింది. ఓటీటీ ఆడియోన్స్‌ను మెప్పించే అన్ని హంగులున్న సినిమా ఇది. తెలుగు ప్రేక్షకులకు నవ్యానుభూతిని పంచే వైవిధ్యమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఇది. అంధాధూన్ చూడని వారిని తప్పకుండా మెప్పిస్తుంది.
రేటింగ్- 2.75/5