ప్రముఖ ఆభరణాల సంస్థ మలబార్ గ్రూప్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చింది. రాష్ట్రంలో రూ.750 కోట్ల పెట్టుబడి పెడ్తామని ఆ సంస్థ చైర్మన్ ఎం.పి.అహ్మద్ తెలిపారు. బుధవారం ఆయన తన ప్రతినిధులతో కలిసి మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు.
ఈ పెట్టుబడులతో గోల్డ్, డైమండ్ జ్యువెలరీ తయారీ ఫ్యాక్టరీ, గోల్డ్ రిఫైనరీ యూనిట్లను ఏర్పాటు చేస్తామన్నారు. తమ పెట్టుబడితో 2500 మంది నైపుణ్యం కలిగిన స్వర్ణకారులకు ఉపాధి లభిస్తుందని సంస్థ తెలిపింది.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన మలబార్ గ్రూప్‌నకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కళా నైపుణ్యం కలిగిన స్వర్ణకారులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉన్నారని, కంపెనీ ఇచ్చే ఉద్యోగాల్లో వీరందరినీ పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి కోరారు.