తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఈ మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. ఈ నెల 25 నాటికి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఆరునెలలు పూర్తవుతున్నందున ఈలోగా సమావేశపరచాల్సి ఉన్నది. వాటి తేదీలను క్యాబినెట్ భేటీలో నిర్ణయించనున్నట్టు తెలిసింది. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులపై కూడా చర్చ జరగనుంది. దళితబంధు పథకంపై ఇచ్చే స్టేట్‌మెంట్‌పైనా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. హుజూరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టు అమలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దీనికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది.
కృష్ణా జలాల విషయంలో అనుసరించాల్సిన వైఖరిపై చర్చించనున్నది. విద్యుత్తు వివాదం, ఉద్యోగ ఖాళీల గుర్తింపు, నియామకాల నోటిఫికేషన్ చర్చకు రానున్నట్టు సమాచారం. రాష్ట్రంలో వరిధాన్యం సాగు అంశం కూడా ప్రస్తావనకు రానుంది. బాయిల్ట్ రైస్‌ను కొనుగోలు చేయలేమని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో.. కేబినెట్ లో కీలక చర్చ జరిగే అవకాశం ఉంది.
వినాయక నిమజ్జనంపై సుప్రీంలో రాష్ట్రప్రభుత్వం వేసిన పిటిషన్ గురువారం విచారణ జరుగనున్న నేపథ్యంలో ఆ ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. వీటితోపాటుగా యాదాద్రి ఆలయ పున:ప్రారంభం అంశం కూడా కేబినెట్ భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.