పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్‌కు కేంద్ర ప్రభుత్వం ‘జెడ్’ కేటగిరీ భద్రత కల్పించింది. మంగళవారం నుంచి ఆయన భద్రత బాధ్యతను సీఐఎస్‌ఎఫ్ తీసుకున్నది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఈ నెల 13న ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర 24 పరగణాల జిల్లా పరిధిలోని జగదల్‌లోని బారాక్‌పూర్ ఎంపీ అర్జున్‌సింగ్ నివాసం వద్ద మంగళవారం ఉదయం మరో బాంబు పేలింది.
ఆయన ఇంటికి 200 మీటర్ల దూరంలో ఈ పేలుడు జరిగింది. ఈ నెల 8వ తేదీన ఆయన ఇంటి సమీపంలోని మైదానంలో మూడు నాటు బాంబులు పేలాయి. దీనిపై ఎన్‌ఐఏ విచారణ చేపట్టిన 24 గంటల వ్యవధిలోనే మరో బాంబు పేలింది. ఆయన ఇంటికి సమీపంలోని ఓపెన్ ప్లేస్‌లో నాటు బాంబ్ పేలింది. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.
కాగా, బెంగాల్‌లోని అధికార టీఎంసీ కార్యకర్తలే ఈ బాంబులను పేలుస్తున్నారని, దీనికి టీఎంసీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని అర్జున్ సింగ్ డిమాండ్ చేశారు. టీఎంసీ మద్దతు కారణంగానే నేరగాళ్లు దర్జాగా తిరుగుతున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి దాడులకు తాను భయపడబోనని అన్నారు. భవానీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నిక పరిశీలకుడిగా తనను బీజేపీ నియమించడం వల్ల తనను భయబ్రాంతులకు గురిచేసేందుకే ఇలా బాంబులు పేలుస్తున్నారని అర్జున్ సింగ్ ఆరోపించారు.