రేపటి నుంచి 18 ఏండ్లు నిండిన వారందరికి వ్యాక్సినేషన్ చేసేందుకు గ్రామ స్థాయిలో కేంద్రాలు ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులకు సూచించారు.
వ్యాక్సిన్ వేసేందుకు తీసుకున్న చర్యలు, చేసిన ఏర్పాట్లపై బుధవారం హనుమకొండ కలెక్టరేట్ నుంచి చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్, రాష్ట్ర అధికారులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు, జడ్పీ చైర్మన్లు, డీపీవోలు, సీఈవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ప్రతి రోజూ 3 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చే విధంగా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని అన్నారు. కొవిడ్ వ్యాక్సినేషన్‌లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ వేసుకునేందుకు 18 సంవత్సరాల పైబడిన వారు 2 కోట్ల 80 లక్షల మంది ఉన్నారని తెలిపారు.