పాడిరంగాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక రూపొందించాలని పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధిశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆదేశించారు. మాసాబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్షించారు. రెండోవిడత గొర్రెల పంపిణీలో వేగం పెంచాలని, డీడీలు చెల్లించిన లబ్ధిదారులకు వెంటనే గొర్రెలు పంపిణీ చేయాలని ఆదేశించారు.
యాంటీరేబిస్ వ్యాక్సిన్ కొరత ఉన్న ప్రాంతాలను గుర్తించి వెంటనే సరఫరా చేయాలని చెప్పారు. గొర్రెలకు ఏడాదిలో మూడుసార్లు నట్టల నివారణ మందు వేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. విజయ డెయిరీ ఉత్పత్తులను ప్రజలకు చేరువచేసేందుకు నూతన ఔట్‌లెట్లు ఏర్పాటు చేయాలన్నారు.
రైతుల నుంచి ఫిర్యాదు వచ్చిన వెంటనే సంచార పశువైద్యశాలలు స్పందించేలా చూడాలన్నారు. నిబంధన ప్రకారం ఉన్న చేప పిల్లలను మాత్రమే విడుదలచేయాలని మత్స్య శాఖ అధికారులకు సూచించారు. సమావేశంలో పశుసంవర్ధకశాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరాం, టీఎస్‌ఎల్‌డీఏ సీఈవో మంజువాణి, షీప్ ఫెడరేషన్ ఎండీ రాంచందర్ పాల్గొన్నారు.