ఆధునిక వ్యవసాయంతో అధిక దిగుబడులు సాధించుకునే దిశగా రైతులు అవగాహన పెంచుకోవాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి రైతులను కోరారు. బుధవారం కొడంగల్ పట్టణంతో పాటు మండలంలోని పర్సాపూర్, హస్నాబాద్ గ్రామాల్లోని ఆయా పాఠశాలలో విద్యార్థులకు మాస్క్, శానిటైజర్లను పంపిణీ చేశారు. అనంతరం గ్రామ శివారులో వ్యవసాయ శాఖ వారు చేపట్టిన యంత్రంతో వరినాటు పద్ధతిని పరిశీలించారు. కంపెనీ యజమాన్యం ద్వారా యంత్ర వినియోగం, ఉపయోగాలపై రైతులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి ఆధునిక యుగంలో వ్యవసాయ సాగులో ఎన్నో అధునాతన పద్ధతులు, యంత్రాలు అందుబాటులోకి వస్తున్నాయని, వాటిపై అవగాహన పెంచుకొని వ్యవసాయంలో అధిగమించాలని తెలిపారు.ఇప్పటి వరకు వరికోత యంత్రాలు అందుబాటులో ఉండగా ప్రస్తుతం నూతనంగా నాటు యంత్రం వచ్చిందని, రైతులు యంత్ర పరికరాలను సద్వినియోగం చేసుకొని సాగు చేపట్టాలని పేర్కొన్నారు. యంత్రంతో వరి నాటు వేసుకోవడం వల్ల ఎకరాకు రూ. 200 ఖర్చు రావడం రైతులకు శుభసూచకంగా పేర్కొన్నారు.
ప్రస్తుతం కూలీల కొరతను అధిగమించడంతో పాటు పెట్టుబడిని తగ్గించుకొని వ్యవసాయం చేసుకోవాలని తెలిపారు. అదే విధంగా పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలలో హస్నాబాద్ గ్రామంలోని జడ్పీహెచ్‌ఎస్, పర్సాపూర్ గ్రామంలోని ప్రాథమిక కొన్నత పాఠశాలలో విద్యార్థులకు మండల పరిషత్ ద్వారా మాస్కులు, శానిటైజర్లను అందించడంతో పాటు 8, 9, 10 తరగతులు విద్యార్థులు మంత్రి సబిత ఇంద్రారెడ్డి అందించిన డిక్షనరీలను పంపిణీ చేశారు.
అదే విధంగా పర్సాపూర్, హస్నాబాద్ గ్రామాల్లో వినాయక విగ్రహాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, సర్పంచ్‌లు పకీరప్ప, సయ్యద్ అంజద్, మున్సిపల్ కౌన్సిలర్ మధుసూధన్‌యాదవ్, పీఏసీఎస్ అధ్యక్షుడు కటకం శివకుమార్, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు సిద్దిలింగప్ప, సురేష్, ఎంట్ల మల్లయ్య, వ్యవసాయాధికారులు ఏడీఏ వినయ్‌కుమార్, ఏవో బాలాజీ ప్రసాద్, ఏఈవో ఢాఖ్యానాయక్ పాల్గొన్నారు.