తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో సదుపాయాలను మెరుగుపర్చాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం బొగ్గులకుంటలో దేవాదాయశాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు. దేవాలయాల్లో భక్తుల సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మౌలిక సదుపాయాల విషయంలో రాజీపడకుండా పనిచేయాలని అధికారులకు సూచించారు. సమస్యలుంటే ఉన్నతాధికారులకు కానీ..లేదంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ఇతర ఆలయాలను ఆధునీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
పవిత్రమైన దేవాదాయ భూముల పరిరక్షణకు అధికారులు చితశుద్ధితో పని చేయాలన్నారు. ఆలయ భూమికి దేవుడే యజమాని అని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఆలయ భూములపై సమగ్ర నివేదిక తెప్పించకోవాలని ఆదేశించారు. రెవెన్యూ రికార్డుల్లో దేవుని పేరు మీద కొత్త పాస్ బుక్‌లు తీసుకోవాలన్నారు. ధరణి వెబ్ సైట్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో నిషేధిత జాబితాలో ఆలయ భూములు ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. హైకోర్టు, దేవాదాయ శాఖ ట్రిబ్యునల్ లో మెమోలు ఫైల్ చేసి, కోర్టు వాయిదాలకు తప్పనిసరిగా హాజరవుతూ.. తదనుగుణంగా తుది ఉత్తర్వులు వచ్చే వరకు నిరంతరం ఫాలో ఆప్ చేయాలన్నారు. దేవాదాయ భూములు పరాధినం కాకుండా కాకుండా చూడటంతో పాటు కబ్జాలకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.