తెలంగాణ మరోమారు చరిత్ర సృష్టించనుంది. దేశంలో డ్రోన్ల ద్వారా మందుల సరఫరా చేసిన మొదటి రాష్ట్రంగా నిలవనుంది. రవాణా సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలకు ఆకాశమార్గంలో మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేసేందుకు రూపొందించిన ‘మెడిసిన్ ఫ్రం స్కై’ ప్రాజెక్టు శనివారం ప్రారంభం కానుంది.
డ్రోన్ల ఫ్లైట్లతో అటవీ ప్రాంతాల ప్రజలకు ఔషదాలు సరఫరా చేయడానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్టును కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా, మంత్రులు కేటీఆర్, సబితాఇంద్రారెడ్డి ప్రారంభించనున్నారు. వికారాబాద్‌లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నెలరోజులపాటు దీనికి సంబంధించిన ట్రయల్‌రన్ జరగనుంది. దీనికోసం మారుట్ డ్రోన్స్, బ్లూ డార్ట్, స్కై ఎయిర్, టెక్ ఈగిల్ సంస్థలు ఇప్పటికే ఏర్పాటు చేశాయి.
ఈ సందర్భంగా డ్రోన్లు ఎంత దూరం వెళ్లగలుగుతాయి, బరువైన పేలోడ్స్ తీసుకెళ్తాయి వంటి అంశాలను నెలరోజులపాటు పరిశీలిస్తారు.రాష్ట్ర ఐటీ శాఖ పరిధిలోని ఎమర్జింగ్ టెక్నాలజీస్ విభాగం ఆధ్వర్యంలో మెడిసిన్ ఫ్రం స్కై ప్రాజెక్టుకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. దీనిని వికారాబాద్‌లో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు కోసం ఐటీ శాఖ.. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్, నీతి ఆయోగ్, హెల్త్‌నెట్ గ్లోబల్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలతో కలిసి పనిచేస్తున్నది.