బాలీవుడ్, టాలీవుడ్ (Tollywood) అనే భేదాలు లేకుండా అన్ని భాషల్లో ప్రస్తుతం బయోపిక్ చిత్రాల ట్రెండ్ కొనసాగుతోంది. సినీ, రాజకీయం, క్రీడలతో పాటు వివిధ రంగాల్లో ప్రతిభను చాటిన ప్రముఖుల జీవితాల్ని వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు.ఆ కోవలో వచ్చిన చిత్రమే ‘తలైవి’ (Thalaivi) . దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈచిత్రానికి ఏ.ఎల్ విజయ్ (AL Vijay )దర్శకత్వం వహించారు. జయలలిత పాత్రలో కంగనా రనౌత్ (Kangana Ranaut ) నటించడం, పాన్ ఇండియన్ స్థాయిలో రూపొందించడంతో ప్రారంభం నుంచే సినీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో ‘తలైవి’ఆసక్తిని రేకెత్తించింది. ఎన్నో అంచనాలతో వినాయకచవితి కానుకగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పించిందా?లేదా తెలియాలంటే కథలోని వెళ్లాల్సిందే..
ఎంజీఆర్ వారసురాలిగా..
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ (అరవిందస్వామి) Arvind Swami హఠాన్మరణంతో ఆయన వారసురాలిగా జయ నియమితురాలవుతుంది. ప్రతిపక్షనేతగా అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆమెను ముఖ్యమంత్రి కరుణతో(నాజర్) పాటు అధికార పార్టీ సభ్యులు అవమానిస్తారు. తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాతే అసెంబ్లీలో అడుగుపెడతానని జయ శపథం చేస్తుంది. ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది. జయ ఎవరు? ఆమె జీవితం ఎలా మొదలైందో సినిమాలో చూపించారు. నటన పట్ల ఇష్టం లేకపోయినా తల్లి కోరిక మేరకు సినిమాల్లో నటిస్తుంటుంది జయ. అగ్రనటుడు ఎంజీఆర్ సరసన హీరోయిన్‌గా ఓ సినిమాలో నటించే అవకాశం ఆమెకు వస్తుంది. తొలుత పెంకితనంతో ఏంజీఆర్‌ను ఆటపట్టిస్తుంది జయ. ఆ తర్వాత అతడి మంచితనాన్ని గ్రహించి ఆరాధిస్తుంది.
వెండితెరపై ఎంజీఆర్, జయ విజయవంతమైన జోడీగా గుర్తింపు తెచ్చుకుంటారు. అదే సమయంలో సామాన్య ప్రజలకు అండగా నిలవాలనే ఆలోచనతో కరుణ, ఎంజీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తారు. తన రాజకీయ జీవితానికి జయ అడ్డుగా ఉండటంతో ఆమెను ఏంజీఆర్ దూరం పెడతాడు. తొలుత రాజకీయాల్ని ద్వేషించిన జయ..ఎంజీఆర్ మాటకు కట్టుబడి అతడి పార్టీలో చేరుతుంది. తన వాక్ చాతుర్యం, ప్రతిభసంపత్తులతో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ మెప్పును పొందుతుంది. ఈ క్రమంలో ఎమ్‌జీఆర్‌తో జయకు అభిప్రాయభేదాలు వస్తాయి. ఆ అపోహలు తొలగి వారిద్దరు మళ్లీ కలుసుకోవాలని అనుకుంటున్న తరుణంలో ఎంజీఆర్ మరణిస్తారు.ఆ తర్వాత జయం జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది?ఆమె ముఖ్యమంత్రి కాగలిగిందా?ఆమె సినీ, రాజకీయ ప్రయాణాన్ని వీరప్పన్, కరుణ ఎలా ప్రభావితం చేశారన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.
సినీ నటిగా, రాజకీయనాయకురాలిగా కోట్లాదిమంది ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితంలోని ముఖ్య ఘట్టాలను ఆవిష్కరిస్తూ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ఈ సినిమాను తెరకెక్కించారు. సాధారణ నటిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆమె పురుషాధీక్యతను, రాజకీయ కుతంత్రాలను ఎదురించి ముఖ్యమంత్రిగా ఎలా విజయాన్ని సాధించిందో ఈ సినిమాలో చూపించారు. జయ సినీ కెరీర్‌లో, రాజకీయ ఎదుగుదలలో ఏంజీఆర్ పాత్రను, వారిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రధానంగానే చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. గురుశిష్యుల బంధానికి మించి వారి మధ్య ఉన్న అమలిన ప్రేమను ఈ సినిమాలో చూపించారు. మహిళ అంటే కేవలం ఓ అలంకారంగానే భావించే సమాజాన్ని ఎదురించి జయలలిత సాగించి పోరాటాన్ని స్ఫూర్తివంతంగా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.
ఎంజీఆర్, జయ ప్రేమ ప్రయాణం..
ప్రథమార్థం పూర్తిగా జయలలిత సినీ జీవితంపైనే దర్శకుడు దృష్టిపెట్టారు. ఎంజీఆర్‌తో జయకు ఏర్పడిన పరిచయం ఎలా ప్రేమగా మారిందో చూపించారు. జయలలిత కెరీర్‌కు నాశనం చేసేందుకు ఎంజీఆర్ సన్నిహితుడు వీరప్పన్ పన్నిన కుట్రల్ని జయ తిప్పికొడుతూ అగ్ర నాయికగా ఎలా గుర్తింపును సొంతం చేసుకుందో చూపించారు. సంభాషణలులేకుండా ఎంజీఆర్, జయలలిత కలిసి నటించిన హిట్ గీతాలను చూపిస్తూ కథను నడిపించారు. ద్వితీయార్థం పూర్తిగా రాజకీయాల నేపథ్యంలో కథ సాగుతుంది. పాలిటిక్స్ ద్వేషించే జయ ఎందుకు పార్టీలో చేరాల్సివచ్చిందనే కారణాల్ని చక్కగా చూపించారు. అమ్ము అంటూ పిలిచే స్థాయి నుంచి ప్రజలంతా అమ్మగా తనను ఆరాధించేలా ఎలా ఎదిగిందో చూపించారు. నాటకీయత, ఉద్వేగాల్ని మేళవిస్తూ ద్వితీయార్థాన్ని దర్శకుడు విజయ్ ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు. ఎంజీఆర్‌కు వ్యతిరేకంగా ఉన్న నియోజకవర్గంలో జయ అడుగుపెట్టే ఎపిసోడ్‌తోపాటు రాజ్యసభలో ప్రసంగించే సన్నివేశం, ఎంజీఆర్ మరణించిన సమయంలో జయకు ఎదురైన అవమానంతో పాటు పతాక ఘట్టాలను ఉద్విఘ్నభరితంగా దర్శకుడు తెరపై ఆవిష్కరించారు.
జయలలిత జీవితాన్ని పూర్తిగా ఈ సినిమాలో చూపించలేదు. ఆమె సినీ కెరీర్ ప్రారంభం నుంచి తొలిసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యే సమయం వరకు ఆమెకు ఎదురైన ఘటనలను చూపిస్తూ సినిమాను తెరకెక్కించారు. వివాదాల జోలికి వెళ్లకూడదనే ఆలోచనతో సినిమాలో ఎవరినీ విలన్‌లుగా ఆవిష్కరించలేదు. అందరిలోని మంచిని మాత్రమే చూపించారు. పాజిటివ్ కోణంలోనే సినిమాను నడిపించారు. చాలా వరకు తెలిసిన విషయాల్నే సినిమాలో చర్చించారు. అగ్రనటిగా నిలదొక్కుకునే క్రమంలో జయలలితకు ఎదురైన కష్టాల్ని సరిగ్గా సినిమాలో ఆవిష్కరించలేకపోయారు. అలాగే ఆమె రాజకీయాల్లో రావడానికి గల కారణాల్ని బలంగా చెప్పలేదు. అభిమాన నాయకురాలిగా ప్రజల హృదయాల్లో ఎలా స్థానం సంపాదించుకుందో చెప్పే ప్రయత్నం చేయలేదు. ప్రథమార్థాన్ని పూర్తిగా తమిళ పాటలతో నింపేశారు. అవి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించడం కొంత కష్టమే.
ప్రాణం పోసిన కంగనారనౌత్..
జయలలిత పాత్రకు కంగనా రనౌత్ ప్రాణప్రతిష్ట చేసింది. 16 నుంచి 43 ఏళ్ల వయసు వరకు జయలలిత జీవితంలోని భిన్న దశలకు తగినట్లుగా రూపురేఖలు, ఆహార్యంలో వైవిధ్యతను కనబరుస్తూ చక్కటి నటనను కనబరిచింది. ప్రథమార్థంలో పెంకితనం, పట్టుదల కలిగిన అల్లరి అమ్మాయిగా కనిపించిన కంగనా రనౌత్ ద్వితీయార్థంలో రాజకీయనాయకురాలిగా చక్కటి భావోద్వేగాల్ని పలికించింది. ఎంజీఆర్‌గా అరవిందస్వామి పాత్ర, నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఎంజీఆర్ మేజరిజమ్స్, ైస్టెల్‌ను అనుకరిస్తూ అద్వితీయ నటనను కనబరిచారు.
అరవిందస్వామి, కంగనా రనౌత్ ఇద్దరూ పోటీపడి నటించారు. కరుణనిధిగా నాజర్, జయలలిత తల్లిగా భాగ్యశ్రీ, ఎంజీఆర్ భార్య జానకిగా మధుబాల, ఎంజీఆర్ నమ్మినబంటు వీరప్పన్‌గా సముద్రఖని తమ పాత్రలకు న్యాయం చేశారు. వాస్తవాల్ని వక్రీకరించకుండా వివాదాలకు తావులేకుండా అందరినీ మెప్పించేలా జయలలిత జీవితాన్ని తెరపై ఆవిష్కరించడం అంటే కత్తిమీదసాము లాంటిదే. ఆ విషయంలో దర్శకుడు విజయ్ చాలా వరకు విజయవంతమయ్యారు. విజయేంద్రప్రసాద్ కథ, స్క్రీన్‌ప్లే సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. మహిళల శక్తిని చాటుతూ వచ్చే సంభాషణలు బాగున్నాయి. జీవి ప్రకాష్ నేపథ్య సంగీతం, విశాల్ ఛాయాగ్రహణం కథకు తగినట్లుగా చక్కగా కుదిరాయి.
జయలలిత జీవితంలో ఊహించని మలుపులు, సవాళ్లతో పాటు తెలియని కోణాలు ఎన్నో ఉన్నాయి. వాటిని చూపిస్తూ సినిమాను తెరకెక్కిస్తే బాగుండేది. ఆ దిశగా చిత్రబృందం ప్రయత్నిస్తే మంచి బయోపిక్‌గా నిలిచేది.
రేటింగ్-2.75/5