తెలంగాణలో సాగు మరింత విస్తరించాల్సిన అవసరం వుందని, సాగుకు సాయం పెరగాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.రాష్ట్రంలో 63.26 లక్షల వ్యవసాయ క్షేత్రాలు, కోటి 50 లక్షల ఎకరాల సాగు భూమి వుందని, ఇందులో91.48 శాతం చిన్న, సన్నకారు రైతులు ఉన్నారని చెప్పారు. వ్యవసాయ మౌళిక సదుపాయాల నిధి, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, కిసాన్ క్రెడిట్ కార్డ్స్, డిజిటల్ అగ్రికల్చర్ విధానం, జాతీయ నూనెగింజలు, అపరాలు, ఆయిల్ పామ్ మిషన్, వ్యవసాయ ఎగుమతులపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలు రాష్ట్రాల వ్యవసాయ శాఖా మంత్రులతో, ఉన్నతాధికారులతో కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్రసింగ్ తోమర్ నిర్వహించిన వీడియా కాన్ఫరెన్స్ అనంతరం మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ నిధికి కేంద్రం విధించిన నిబంధనల ప్రకారం అర్హులయిన వారు కేవలం 35.19 లక్షల మంది రైతులు మాత్రమే ఉన్నారని తెలిపారు.కేంద్రం కిసాన్ సమ్మాన్ నిధి వర్తింపు విషయంలో నిబంధనలు సడలించి రాష్ట్రంలోని ప్రతి చిన్న, సన్నకారు రైతుకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని కోరారు. కేంద్రం ఈ పథకం కింద ఎనిమిదో విడతలో రాష్ట్రానికి ఇచ్చింది రూ.703.81 కోట్లు మాత్రమేనని తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం కింద సాలీనా రూ.15 వేల కోట్లు ఇవ్వడమే కాకుండా ఇతర వ్యవసాయ అనుకూల విధానాలతో రైతులను ప్రోత్సహిస్తుందని వివరించారు.
వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు కూడావ్యవసాయ మౌళిక సదుపాయాల నిధిని వర్తింపజేయాలన్నారు.డిజిటల్ వ్యవసాయ విధానంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ సర్వేకు సిద్దమవుతున్నదని మంత్రి వివరించారు.డిజిటల్ సర్వే ప్రక్రియ పూర్తి అయిన అనంతరం కేంద్రం చేపట్టిన డిజిటల్ వ్యవసాయ విధానంలో భాగస్వాములం అవుతామని ఆయన తెలిపారు.