తయారీ రంగంలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో హైదరాబాద్ మహానగరం దేశంలోనే ముందంజలో ఉందని జేఎల్‌ఎల్ నివేదిక వెల్లడించింది. భారతీయ సిలికాన్ వ్యాలీగా పిలిచే బెంగళూరు తర్వాత రెండో సిలికాన్ వ్యాలీగా హైదరాబాద్ నిలిచింది. ఐటీ రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా మారింది. ముఖ్యంగా దేశంలోనే స్టార్టప్‌లకు హబ్‌గా హైదరాబాద్ ఎదిగింది.
ఐటీ రంగంతోపాటు ఫార్మా, బయోటెక్, ఏరోస్పేస్, రక్షణ, ఈఎస్‌డీఎం, మెడికల్ డివైజెస్ రంగాలకు సంబంధించిన విభాగాల్లో మంచి పనితీరును భాగ్యనగరం కనబరుస్తోందని నివేదికలో పేర్కొన్నారు. ప్రధానంగా దేశీయ బల్క్ డ్రగ్ ఎగుమతుల్లో 50 శాతం ఇక్కడి నుంచే ఉన్నాయి. అలాగే 1/3 వ్యాక్సినేషన్ తయారీ ఇక్కడి పరిశ్రమల్లోనే జరుగుతోంది.
ఇక ఐటీ రంగంలో దేశంలోనే అత్యధికంగా 53 ఎస్‌ఈజెడ్‌లు ఉన్న నగరంగా హైదరాబాద్ రికార్డు సృష్టించింది. యాపిల్, అమెజాన్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్, ఊబర్, గూగుల్, క్వాల్‌కామ్ వంటి ఎన్నో అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలకు అమెరికా తర్వాత ఇక్కడే అతిపెద్ద కార్యాలయాలున్న విషయం తెలిసిందే. అన్ని రంగాలకు సంబంధించిన నైపుణ్యం కలిగిన మానవ వనరులు హైదరాబాద్‌లో పుష్కలంగా ఉన్నట్లు ఇన్వెస్ట్ ఇండియా సంస్థతో కలిసి జేఎల్‌ఎల్ సంస్థ రూపొందించిన తాజా నివేదికలో స్పష్టమైంది. ఈ నివేదికలో పరిశ్రమల ఏర్పాటు కోసం రూపొందించిన టీఎస్-ఐపాస్‌ను ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం.