దేశ రాజధాని ఢిల్లీలోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ భవనం తెలంగాణ ఆత్మ గౌరవం, అస్తిత్వానికి చిహ్నంగా నిలుస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. దక్షిణాదికి సంబంధించి ఢిల్లీలో కార్యాలయం ఏర్పాటు చేసిన రెండో ప్రాంతీయ పార్టీ టీఆర్‌ఎస్ మాత్రమేనని చెప్పారు. ఢిల్లీలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి గురువారం శంకుస్థాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. తొలుత, వసంత్ విహార్‌లోని స్థలంలో భూ వరాహస్వామి యజ్ఞం నిర్వహించారు. పూర్ణాహుతి కార్యక్రమం ముగిసిన తర్వాత, మధ్యాహ్నం 1.48 గంటలకు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ భూ సంప్రోక్షణ చేసి భూమి పూజ చేశారు. మధ్యాహ్నం 12.40 గంటలకు మంత్రి కేటీఆర్ ప్రాంగణానికి చేరుకున్నారు.
సీఎం రాకకు ముందు కొద్దిసేపు ఆయన హోమంలో పాల్గొన్నారు. ఎంపీలు కేకే, సంతోష్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్‌తో కలిసి మధ్యాహ్నం 1.15 గంటలకు కేసీఆర్ చేరుకొని.. నేరుగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేద పండితులు గోపీకృష్ణ శర్మ, ఫణి శశాంక శర్మ పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం తన అధికార నివాసానికి వెళ్లారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రముఖ వాస్తు నిపుణుడు సుద్దాల సుధాకర్ తేజ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగాయి. కార్యక్రమం ముగిసిన తర్వాత కేటీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు. రెండు దశాబ్దాల కిందట జలదృశ్యం వద్ద కేసీఆర్ నాయకత్వంలో ఊపిరి పోసుకున్న టీఆర్‌ఎస్.. ఈరోజు అదే నాయకుడి చేతుల మీదుగా దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేసుకోవడం చారిత్రక సన్నివేశమని అన్నారు.
ఉద్యమ చరిత్రతోపాటు టీఆర్‌ఎస్ చరిత్రలోనూ శాశ్వతంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని, తెలంగాణ పదమే నిషిద్ధమైన రోజుల్లో టీఆర్‌ఎస్ కార్యాలయం ఉన్న జల దృశ్యం నుంచి సామాన్లను రోడ్డున పడేసిన చంద్రబాబు కక్షపూరిత పాలన, ఆ తర్వాత తెలంగాణ ఆశను చిదిమేయాలని చూసిన వైఎ్‌సఆర్ పాలన వరకు ఎదురైన అన్ని అడ్డంకులనూ ఒక్కటొక్కటిగా తొలగించుకుంటూ ముందుకు సాగిందని వివరించారు. ఏడేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పురోగమిస్తోందని, తెలంగాణ భాష, సంస్కృతులకు పెద్ద పీట వేస్తూ, ఉమ్మడి పాలనలో జరిగిన విధ్వంసం నుంచి మహత్తర పునర్నిర్మాణ ప్రయాణం దిగ్విజయంగా కొనసాగుతోందని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ కోసం పాటుపడుతున్న ప్రజా ప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మంత్రు లు, ఎంపీలు, తుమ్మల నాగేశ్వర రావు పాల్గొన్నారు.