ఏపీలో ప్రభుత్వోద్యోగాలకు వయోపరిమితి పెంపుపై నిరుద్యోగులకు రాష్ట్రప్రభుత్వం షాకిచ్చే నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే వయోపరిమితిని ఐదేళ్లు సడలిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఏడాది మే 31తో ఎస్సీ, ఎస్టీలకు పెంచిన వయోపరిమితి గడువు ముగిసింది. ఇప్పుడు దీనిని 2026 మే 31 వరకు పెంచారు.
అయితే ఓసీ, బీసీ, ఈబీసీలకు ఈ సడలింపు ఇవ్వకపోవడంపై నిరుద్యోగ యువత భగ్గుమంటోంది. రాష్ట్రంలో రెండేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. అదే సమయంలో ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి సిద్ధమవుతున్న అభ్యర్థుల వయసు పెరిగిపోతోంది. వీరందరికీ న్యాయం జరగాలంటే గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలకు వయోపరిమితి పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
ఓసీ అభ్యర్థులకు వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచితే.. బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు ఆటోమేటిగ్గా పెరుగుతుంది. దీనిపై నిరుద్యోగులు అనేకసార్లు విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం తోసిపుచ్చింది. ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే ఐదేళ్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇది తమను మోసగించడమేనని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వయోపరిమితి పెంపు అంశాన్ని పరిశీలిస్తానని ప్రస్తుత సీఎం జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చారని గుర్తుచేస్తున్నారు.