మీ ఓటు ఎటువైపు.. కుట్టు మిషన్లకా.. కళ్యాణలక్ష్మికా..? అరవై రూపాయాల గోడ గడియారానికా.. కేసీఆర్ కిట్‌కా..? రూపాయి బొట్టుబిళ్లకా.. రూ.2016 పెన్షన్లకా..? అని మంత్రి హరీశ్‌రావు ఓటర్లను ఉద్దేశించి అడిగారు. వీటిలో ఏది ఉపయోగమో ఆలోచించాలని ఓటర్లకు ఆయన సూచించారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలోని దమ్మక్కపేటలో యాదవ భవన నిర్మాణ పనులకు మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. గెల్లు శ్రీను ఉద్యమకారుడు. 20 ఏండ్లు టీఆర్ఎస్‌లో పని చేశాడు. ఉద్యమంలో అతనిపై 130 కేసులు నమోదయ్యాయి. 20 రోజులు చంచల్ గూడ, 10 రోజులు చర్లపల్లి జైలుకు వెళ్లాడు. అలాంటి ఉద్యమకారుడైన గెల్లు శ్రీనును గెలిపించండి.. మీ అభివృద్ధి బాధ్యత తాము తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఏడేండ్లలో ఎలాంటి అభివృద్ధి చేపట్టని ఈటల రాజేందర్.. ఇవాళ గడియారాలు, కుట్టుమిషన్లతో పాటు ఇతర వస్తువులు పంచాల్సిన అవసరం ఏంటని హరీశ్‌రావు ప్రశ్నించారు.
డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో ఈటల రాజేందర్ నిర్లక్ష్యం వహించారు. ఈ నియోజకవర్గంలో అర్హులైన వారందరికీ ఇండ్లు తప్పకుండా కట్టిస్తాం. సొంత జాగా ఉన్న వాళ్లకు పైసలిచ్చి ఆదుకుంటాం. ఒక్క ఇల్లు కూడా కట్టించలేని ఈటల రాజేందర్.. ఒక వేళ గెలిస్తే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏపని అయినా చేస్తాడా? అని అడిగారు. ఒక వ్యక్తి లాభం కావాలా..? హుజూరాబాద్ ప్రజల లాభం కావాలా? ఆలోచించుకోవాలని ప్రజలకు హరీశ్‌రావు సూచించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తుందన్నారు. ఉద్యోగాలను ఊడగొడుతున్నారు. బీఎస్ఎన్ఎల్ వంటి సంస్థల్ని అమ్మేస్తూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లను కూడా ఊడగొడుతున్నారని మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు.