కరోనా నేపథ్యంలో విద్యార్థులకు అదనపు పోషకాహారం అందించేందుకు చర్యలు చేపట్టారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు రాగిజావ, బెల్లం, లేత మొలకలను అందించనున్నారు. ఇందుకు కేంద్ర విద్యాశాఖ సైతం ఆమోదం తెలిపింది. 2021-22 మధ్యాహ్న భోజన పథకం ప్రాజెక్ట్ ఆమోదిత మండలి (పీఏబీ) మినట్స్‌ను ఇటీవలే కేంద్రం విడుదల చేసింది.
ఈ ఏడాదికి 16,828 పాఠశాలల్లో 59 రోజులపాటు 7.75 లక్షల మందికి రాగిజావ, 7,277 పాఠశాలల్లో 61 రోజులపాటు 4.48 లక్షల మందికి బెల్లం, లేత మొలకలు అందించేందుకుగాను రూ.13.70 కోట్లను వెచ్చించనున్నారు. ఇందులో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు భరించనున్నాయి.
ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 222 రోజులు, ఎన్‌సీఎల్‌పీ స్కూళ్లల్లో 285 రోజులపాటు మధ్యాహ్న భోజనాన్ని అందజేయనున్నారు. 54,232 మంది కుక్ కమ్ హెల్పర్లను కొనసాగించేందుకు అనుమతులు లభించాయి. మొత్తంగా 41 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని వినియోగించనున్నారు. ఈ ఏడాది మొత్తం మధ్యాహ్న భోజన పథకానికి రూ.282 కోట్లు ఖర్చుచేయనున్నారు.