తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిర్మించిన అగ్రి ఇన్నొవేషన్ హబ్‌ను మంత్రి కేటీఆర్ ప్రాంరభించారు. అనంతరం అగ్రిహబ్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్, ఉత్పత్తులను పరిశీలించారు. రూ.9 కోట్ల నాబార్డ్ సాయంతో దీనిని నిర్మించారు. వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించనుంది. అగ్రిహబ్‌లో 14 స్టార్టప్ కంపెనీలు కొలువుదీరనున్నాయి. ఈ కార్యక్రమంలో నాబార్డ్ చైర్మన్ గోవిందరాజులు, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.
వ్యవసాయరంగంలో ఇన్నొవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లను ప్రోత్సహించేందుకు అగ్రిహబ్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేయనున్న హబ్ సేవలను గ్రామీణ ప్రాంతాల రైతులకు చేరువచేసేందుకు జగిత్యాల, వరంగల్, వికారాబాద్‌లో ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అగ్రిహబ్‌ను 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. రోబోటిక్ విధానంలో కలుపు తీయడం, డ్రోన్ల ద్వారా పంటలో తెగుళ్లను గుర్తించడం వంటి సమాచారం అందుబాటులో ఉంటుంది. గ్రామీణయువత, మహిళలు, రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అగ్రిబిజినెస్ మెళకువలు నేర్చుకునేందుకు గ్రంథాలయంగా ఉపయోగపడుతుంది. నాణ్యతగల విత్తనాలు, మొక్కలకు కావల్సిన ఎరువులు, పురుగుమందులు, పంట దిగుబడి తదితర వివరాలు అందుబాటులో ఉంటాయి.