ప్రైవేటు బిల్డర్లు కడితే రూ.50-60 లక్షల ధర పలికే ఫ్లాట్లను డబుల్ బెడ్‌రూం ఇండ్ల రూపంలో పేదలకు రాష్ట్రప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నదని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ ఇండ్ల నిర్మాణంలో నాణ్యతలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు.మలక్‌పేట నియోజకవర్గం ఛావ్‌నీ డివిజన్‌లో రూ.29.41 కోట్లతో నిర్మించిన 288 పిల్లిగుడిసెల డబుల్ బెడ్‌రూం ఇండ్ల ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ శనివారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మంత్రి మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, ఎమ్మెల్యే అహ్మద్ బలాలాతో కలిసి లబ్ధిదారులకు ఇండ్లపట్టాలు అందజేశారు. ఈ డబుల్‌బెడ్‌రూం ఇండ్ల సముదాయంలో షిండ్‌లేర్ కంపెనీ లిఫ్టు వాడామని, సీఎం కేసీఆర్ నివాసం ఉండే ప్రగతిభవన్‌లో కూడా ఇదే లిఫ్టు వాడుతున్నారని తెలిపారు.
డబుల్ బెడ్‌రూం ఇండ్ల నాణ్యతలో ప్రభుత్వం రాజీపడటం లేదనేందుకు ఇదే నిదర్శనమన్నారు. నిరుపేదల ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచేలా రూ.18వేల కోట్లతో డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్‌లో రూ.9,700 కోట్లతో లక్ష ఇండ్ల నిర్మాణం చేపట్టామన్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో లబ్ధిదారులకు ఇండ్ల పంపిణీ జరగ్గా.. 70 వేల ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. కరోనా కారణంగా ఆలస్యమైందని, వాటిని త్వరలో ప్రజలకు అందిస్తామని తెలిపారు.