తెలంగాణలో నిర్మల్ జిల్లాలోని కడెం మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. మండలంలోని పాండవపూర్ వద్ద ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నవ వధువు మౌనిక (25), ఆమె తండ్రి రాజయ్య (50) మృతి చెందారు. పెండ్లి కొడుకుతో పాటు కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు.
కడెం మండలం పాత మద్దిపడగకు చెందిన రాజయ్య.. ఈ నెల 25న మహారాష్ట్రకు చెందిన ఓ యువకుడితో తన కూతురి వివాహం జరిపించాడు. ఈ క్రమంలో అత్తగారింట్లో రిసెప్షన్ తర్వాత వారు పుట్టింటికి తిరిగి వస్తుండగా పాండవపూర్ వద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నవ వధువు, ఆమె తండ్రి మృతి చెందడంతో పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి.
క్షతగాత్రులను జనార్ధన్ ( మౌనిక భర్త ), రణదీర్ ( డ్రైవర్ ) గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను ఖానాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను నిర్మల్ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.