Home / SLIDER / దళితబంధు దేశానికే పాఠం

దళితబంధు దేశానికే పాఠం

తెలంగాణ కోసం కదిలిననాడు నావెంట మీరంతా కదిలిండ్రు, రాష్ర్టాన్ని సాధించుకొనేదాకా నావెంట నడిచిండ్రు. నేను కొట్లాడితే నాకు సహకరించిండ్రు. ఏడేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమానికి అండగా నిలబడిండ్రు. దళితుల అభివృద్ధి కోసం అదే ఉద్యమస్ఫూర్తితో నేను చేస్తున్న పోరాటానికి కూడా సహకారం అందించండి. పట్టుబడితే సాధించలేనిది ఏమీ లేదు. పట్టుబట్టి తెలంగాణ సాధించుకున్నం. అదే పట్టుదలతో తెలంగాణ స్వరాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నం. దళితుల సమగ్రాభివృద్ధి కూడా అంతే పట్టుదలతో సాధించుకుని తీరుతం. పట్టుబడితే తప్పకుండా సాధించే లక్షణం తెలంగాణ సమాజం ప్రత్యేకత.

దేశంలో దళితుల కోసం కంకణబద్ధులై పనిచేసే ప్రభుత్వాలే నేటి అవసరం. హుజూరాబాద్‌లో పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద అమలుపరుస్తున్న దళితబంధును విజయవంతం చేస్తాం. దేశానికే పాఠం నేర్పేలా దళితబంధును నిలబెడతాం.
–దళితబంధు సమీక్షలో సీఎం కేసీఆర్‌

ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ సాధించిన విధంగానే.. దళితబంధు విజయవంతానికి గట్టిగా పట్టుబడతానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. దళితుల సమగ్రాభివృద్ధి కోసం చివరి రక్తపు బొట్టుదాకా పోరాడుతానని ప్రకటించారు. దళితజాతి పేదరికంలో మగ్గిపోవడానికి సామాజిక వివక్షే కారణమని చెప్పారు. ఎప్పుడు, ఎవరు పెట్టిండ్రోగానీ ఇది దుర్మార్గమైన ఆచారమని.. ఇప్పటికైనా దళితుల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి తెలంగాణ సమాజమంతా కదిలిరావాలని పిలుపునిచ్చారు. పట్టుబడితే సాధించలేనిదంటూ ఏమీలేదని పునరుద్ఘాటించారు. పట్టుబట్టి తెలంగాణ సాధించుకున్నామని, అదే పట్టుదలతో స్వరాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నమని చెప్తూ.. దళితుల సమగ్రాభివృద్ధిని కూడా అంతే పట్టుదలతో సాధించుకుని తీరుతామని స్పష్టంచేశారు. దళితబంధు యావత్‌ దేశానికే పాఠం కాబోతున్నదన్నారు. పట్టుబడితే తప్పకుండా సాధించే లక్షణం తెలంగాణ సమాజం ప్రత్యేకత అన్నారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌లో శుక్రవారం ముఖ్యమంత్రి అధ్యక్షతన తెలంగాణ దళితబంధు అమలుతీరుపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నం. ఈ ఏడేండ్లలో అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నం.

సాగునీటి రంగాన్ని పునరుజ్జీవనం చేసుకున్నం. దండగన్న వ్యవసాయాన్ని పండగ చేసుకున్నం. కరెంటును నిరంతరాయంగా ఇచ్చుకుంటున్నం. రాష్ట్రం వచ్చిననాడు అర్థంకాని పరిస్థితుల నుంచి అర్థవంతమైన, గుణాత్మకాభివృద్ధి దిశగా తెలంగాణ అడుగులేస్తున్నది. ఆకలిచావుల నుంచి 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తితో అన్నపూర్ణగా ఎదిగింది. కునారిల్లుతున్న కులవృత్తులను కోట్లు వెచ్చించి ఆర్థికంగా నిలబెట్టుకున్నం. గొర్రెల పెంపకం, చేపల పెంపకం, చేనేతకు ఆసరా, ఎంబీసీలకు అండగా నిలబడింది ప్రభుత్వం. అన్నిరంగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్నివర్గాలకు అండదండలు అందిస్తూ ఏడేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం నేనున్నాననే ధీమాను, స్ఫూర్తిని అందిస్తున్నది’ అని తెలిపారు. ‘రైతుబంధు, రైతుబీమాతో వ్యవసాయానికి ఉపశమనాన్ని కలిగించినం. వలసపాలనలో అన్నిరంగాల్లో గాడి తప్పిన తెలంగాణ నేడు ఒక దరికి చేరుకున్నది. బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, బోదకాలు బాధితులకు పింఛన్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్‌, అమ్మఒడి వాహనాలు వంటి ప్రజాసంక్షేమ కార్యక్రమాలు అమలుపరుస్తున్నం. అన్ని రంగాలను సరిదిద్దుకుంటూ, సవరించుకుంటూ ఇప్పుడిప్పుడే ఒక దరికి చేరుకున్నం’ అని చెప్పారు.

దేశానికి పాఠం నేర్పేవిధంగా
దేశవ్యాప్తంగా దళితుల పరిస్థితి దారుణంగా ఉన్నదని సీఎం కేసీఆర్‌ అన్నా రు. దేశంలో దళితులపట్ల ఆర్థిక, సామాజిక వివక్ష పోవాలంటే కంకణబద్ధులై పనిచేసే ప్రభుత్వాలే నేటి అవసరమని చెప్పారు. హు జూరాబాద్‌లో పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద అమలుపరుస్తున్న దళితబంధును అందరి సహకారంతో విజయవంతం చేస్తామని అన్నారు. దేశానికే పాఠం నేర్పేలా దళితబంధును నిలబెడదామని చెప్పారు.

ప్రతి దళిత కుటుంబం అభివృద్ధి చెందేదాకా..
దళితులకు ఆస్తుల్లేకపోగా, సామాజిక వివక్షకు గురవుతున్నారని సీఎం కేసీఆర్‌ ఆవేదన వ్యక్తంచేశారు. ‘అవకాశాలు కల్పిస్తే వారిలో వజ్రాలు ఉన్నయి. ఇప్పుడు ఆ అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం ముందుకు తెచ్చింది. ఇది ఓట్లకోసం చేపట్టినది కాదు. ప్రతి దళిత కుటుంబాన్ని అభివృద్ధిపరిచే దాకా ఈ కార్యక్రమం కొనసాగుతుంది’ అని చెప్పారు. ‘సమగ్ర కుటుంబ సర్వేలో రాష్ట్రంలో 17 లక్షల దళిత కుటుంబాలు ఉన్నయని తేలింది. దళిత జనాభా పెరుగుతున్నది. దానికి తగ్గట్టు రాబోయే కాలంలో రిజర్వేషన్ల శాతాన్ని పెంచుకొనే ప్రయత్నం చేద్దాం’ అని సీఎం తెలిపారు.

దళితబంధు ద్వారా లక్షల మందికి ఉపాధి
తెలంగాణ పరిశ్రమల రంగంలో ఇప్పటివరకు రూ.2.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, తద్వారా 15 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దకాయని సీఎం తెలిపారు. అదే పద్ధతిలో రూ.1.75 లక్షల కోట్లను దళితులకు పెట్టుబడిగా అందించడం ద్వారా అది పునరుత్పాదకత సాధిస్తుందని, లక్షలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని వివరించారు. ‘ఒకసారి అభివృద్ధి చెందిన కుటుంబం కిందపడకుండా రక్షణనిధి ‘సపోర్టివ్‌ స్ట్రక్చర్‌’ను ఏర్పాటుచేశాం. ఇటువంటి విధానం ప్రపంచంలోనే ఒకటి, రెండుచోట్ల ఉన్నది. దేశంలో మొదటిది’ అని తెలిపారు.

లబ్ధిదారులకు ఖాతా
హుజూరాబాద్‌లో పైలట్‌ ప్రాజెక్ట్‌ అమలుపై అధికారులతో చర్చించిన సీఎం పలు సూచనలు చేశారు. మొదట ప్రతి దళిత కుటుంబం స్థితిగతులను తెలుసుకొనేలా కుటుంబ గణన చేయాలని చెప్పారు. చేపట్టిన పనిని ఇష్టంతో సమర్ధంగా నిర్వహించగలిగే పరిస్థితి లబ్ధిదారునికి ఉన్నదా? అనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. ప్రతి లబ్ధిదారుకు ప్రత్యేకంగా ‘తెలంగాణ దళితబంధు బ్యాంకు ఖాతా’ తెరిపించాలని చెప్పారు. దళితబంధు అకౌంట్‌ను ట్యాగ్‌ చేసుకొని లబ్ధిదారు కుటుంబం చేపట్టిన పని పురోగతిని ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తగు సలహాలు, సూచనలు అందించాలని ఆదేశించారు.

ఔత్సాహికుల కోసం డెయిరీఫామ్‌
ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి, బీసీ వెల్ఫేర్‌ మంత్రి కరీంనగర్‌ జిల్లావారే కావడం, ఫైనాన్స్‌ మినిస్టర్‌ది పక నియోజకవర్గమే కావడం హుజూరాబాద్‌ పైలట్‌ ప్రాజెక్టు విజయవంతానికి మరింత సుగమమవుతుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. పాల ఉత్పత్తిరంగంలో కరీంనగర్‌ డైయిరీ సక్సెస్‌ స్టోరీ చూసి తనకెంతో గర్వంగా ఉన్నదని చెప్పారు. పాల ఉత్పత్తికి జిల్లాలో అనుకూల వాతావరణం ఉన్నదన్న సీఎం.. దళితబంధులో భాగంగా ఔత్సాహికుల కోసం డెయిరీఫామ్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు.

దళిత సంఘాల నేతలు, మేధావులతో చర్చ
సమావేశంలో పాల్గొన్న దళిత నేతలు, మేధావులు, సీనియర్‌ రాజకీయ నాయకులతో సీఎం ఈ సందర్భంగా చర్చించారు. సీఎం కేసీఆర్‌ చేపట్టిన దళితబంధు ఆర్థికంగానే కాకుండా దళితులకు సాధికారతను కల్పిస్తుందని పలువురు మేధావులు అన్నారు.రాజ్యాంగరచన కోసం నాడు అంబేద్కర్‌ చేసిన మేధోమథనాన్ని నేడు సీఎం కేసీఆర్‌ దళితబంధు రూపకల్పన, అమలుకోసం చేస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, ఎంపీ సంతోష్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌, మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండా శ్రీనివాస్‌, మాజీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, సీఎంవో కార్యదర్శులు స్మితాసబర్వాల్‌, రాహుల్‌ బొజ్జా, కలెక్టర్‌ కర్ణన్‌, కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌, నాయకులు కౌశిక్‌రెడ్డి, పెద్దిరెడ్డి, బ్యాంకర్లు, సంక్షేమశాఖ అధికారులు, దళిత సంఘాల నేతలు మేడి మహేశ్‌, కంసాల శ్రీనివాస్‌, బొగ్గుల మల్లేశం, దుంపల జీవన్‌, గోసుకంటి అరుణ్‌, నల్లా కనకరాజు పాల్గొన్నారు.

దళిత మేధావులూ గ్రామాలకు తరలండి
దళితబంధు కార్యక్రమాన్ని అన్ని దళిత కుటుంబాలకు చేర్చేందుకు, వారిని ఆర్థికంగా అభివృద్ధి పరిచేందుకు దళిత మేధావివర్గం నడుం బిగించాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. ‘గ్రామాలకు తరలండి. దళితవాడల్లో ప్రతి కుటుంబాన్ని కలవండి. వారికేమి కావాలో తెలుసుకోండి. మన జాతిని మనమే బాగు చేసుకుందాం’ అని పిలుపునిచ్చారు.

దళితబంధుకూ పరిమితుల్లేవు
ఉమ్మడి పాలనలో వివక్షకు గురైన వ్యవసాయరంగాన్ని రైతుబంధు ద్వారా ఎైట్లెతే పట్టుబట్టి అభివృద్ధి పరుచుకున్నమో.. దళితజాతిని అభివృద్ధి చేసుకోవడంలో కూడా అదే సిద్ధాంతం ఇమిడి ఉన్నదని కేసీఆర్‌ తెలిపారు. దళితబంధుకు కూడా పరిమితులు లేవన్నారు. దళితబస్తీలోని దరిద్రాన్ని బద్దలుకొట్టాలంటే ఉద్యోగస్థులకు కూడా ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఎస్సీవర్గాల్లోని అన్ని ఉపకులాలకు కూడా పథకం వర్తిస్తుందని తెలిపారు. లక్షా డబ్బు ఐదు వేల కోట్లు ఖర్చు చేసి యావత్తు తెలంగాణ దళిత కుటుంబాలను దశలవారీగా రాబోయేకాలంలో అభివృద్ధి పరుచుకుంటామని చెప్పారు. ఏటా 20వేల నుంచి 30 వేల కోట్లు ఖర్చుచేస్తూ 2 లక్షల నుంచి 3 లక్షల కుటుంబాలకు దళితబంధును అమలుపరుస్తామన్నారు. హుజూరాబాద్‌ నుంచి ప్రారంభమయ్యే దళిత చైతన్యజ్యోతి తెలంగాణవ్యాప్తంగా విస్తరించి దేశానికే వెలుగులు పంచనున్నదని, అణగారిన దళితవర్గాల్లో చైతన్యాన్ని తీసుకు వస్తుందని అన్నారు. ‘స్పష్టమైన అవగాహనతో తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి గమ్యాన్ని ఎలాగైతే ముద్దాడామో.. అంతే స్పష్టమైన అవగాహనతో దళితబంధు ఉద్యమాన్ని నడిపించి, గమ్యాన్ని ముద్దాడుతాం’ అని కేసీఆర్‌ స్పష్టంచేశారు.

ట్రైనింగ్‌ గ్రౌండ్‌గా హుజూరాబాద్‌
దళిత కుటుంబాల వద్దకు వెళ్లినప్పుడు అధికార భాషలో కాకుండా వారికి అర్థమయ్యే భాషలో.. అర్థమయ్యే రీతిలో మాట్లాడాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. ఒపీనియన్‌ మేకర్స్‌గా, ఫెసిలిటేటర్లుగా, సామాన్య కార్యకర్తలాగా వ్యవహరించాలని, వారితో ఇంటిమసీ పెంచుకోవాలని చెప్పారు. ఉద్యమస్ఫూర్తితో పనిచేయాలని.. దళిత మేధావులు, విద్యార్థులు సహకరిస్తారని, అండగా నిలబడుతారని తెలిపారు. త్వరలో హైదరాబాద్‌లో విసృ్తతస్థాయి సమావేశం ఏర్పాటు చేసుకుందామని అన్నారు. దళితబంధు మహా ఉద్యమంగా మారబోతున్నదని, హుజూరాబాద్‌ యావత్‌ తెలంగాణకు ట్రైనింగ్‌ గ్రౌండ్‌ కాబోతున్నదని ప్రకటించారు.

లైసెన్స్‌లు- కాంట్రాక్ట్‌లలో రిజర్వేషన్లు
దళితబంధు ద్వారా అమలుపరుస్తున్న కార్యక్రమాల వివరాలతో కూడిన కరపత్రాన్ని వెంట తీసుకువెళ్లి అందులో పొందుపర్చిన వివిధ వ్యాపార, ఉపాధి మార్గాలను వివరించాలని.. లబ్ధిదారులే స్వయంగా వారి పనిని ఎంచుకునేందుకు సహకరించాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఫలానా పనినే చేయాలనిగానీ, ఫలానా చోటనే చేయాలనిగానీ నిబంధనలేమీ లేవన్నారు. అందరూ ఒకే పనికాకుండా భిన్నమైన పనులను ఎంచుకోవడం ద్వారా ఆర్థికంగా మరింతగా లబ్ధి పొందవచ్చని సూచించారు. ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చే ఫర్టిలైజర్‌, మెడికల్‌, వైన్స్‌ తదితర రంగాల్లో దళితులకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. హాస్టళ్లు, దవాఖానలు, విద్యుత్తురంగ సంస్థలకు మెటీరియల్‌ సప్లయ్‌ చేసే అంశంలో, సివిల్‌ సప్లయ్స్‌ రంగలో కూడా దళితులకు అవకాశాలను మెరుగుపరుస్తామని చెప్పారు. కాంట్రాక్టుల్లోనూ కొంతశాతం రిజర్వేషన్‌ కోసం ఆలోచన చేస్తామన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat