మలక్‌పేట నియోజకవర్గంలోని పిల్లిగుడిసెలు బస్తీలో నూతనంగా నిర్మించిన 288 డబుల్ బెడ్రూం ఇండ్లను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించనున్నారు. ఈ ఇండ్లను తొమ్మిది అంతస్తుల్లో రూ. 24.91 కోట్ల వ్యయంతో నిర్మించారు.
హైదరాబాద్ నగరాన్ని స్లమ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే. ఈ క్రమంలో మురికివాడగా ఉన్న పిల్లిగుడిసెలు బస్తీలో ఇప్పుడు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి.. ఆ ప్రాంతానికి కొత్త అందాన్ని తెచ్చారు. ఈ కాలనీలో కొత్తగా సీసీ రోడ్లు వేశారు. తాగునీటి అవసరాల కోసం 100 కేఎల్ సామర్థ్యంతో సంప్‌ను నిర్మించారు. 19 షాపులను ఏర్పాటు చేశారు.
డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, మహముద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో పాటు పలువురు పాల్గొననున్నారు.