ఎనిమిది మంది హైకోర్డు జడ్జిలు, సీనియర్ అడ్వకేట్ పీఎస్ నరసింహను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలంటూ కొలీజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం ఆమోదం తెలిపారు.
కొత్తగా నియమితులైన సుప్రీంకోర్టు జడ్జిల్లో ముగ్గురు మహిళలు.. జస్టిస్ బీవీ నాగరత్న, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బేలా ఎం త్రివేది ఉన్నారు. తాజా నియామకాలతో సుప్రీంకోర్టులో ఒక మహిళ ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపట్టే అవకాశం ఏర్పడింది. సీనియారిటీ ప్రకారం 2027 సెప్టెంబర్‌లో జస్టిస్ నాగరత్న భారత సీజేగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
జస్టిస్ నాగరత్న తండ్రి ఈఎస్ వెంకటరామయ్య కూడా 1989లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. కర్ణాటక నుంచి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయిన తొలి వ్యక్తి ఆయనే. తొమ్మిది మంది న్యాయమూర్తుల నియామకంపై కేంద్ర న్యాయశాఖ వేర్వేరుగా ఉత్తర్వులు జారీచేసింది. సుప్రీంకోర్టులో మొత్తం జడ్జిల సంఖ్య 34. ఇప్పటివరకు 10 ఖాళీలు ఉన్నాయి. కొత్తగా నియమితులైన జడ్జిలు ప్రమాణ స్వీకారం చేస్తే కేవలం ఒకే ఒక్క పోస్టు ఖాళీగా ఉంటుంది. కాగా, నూతన న్యాయమూర్తులు ఈ నెల 31న ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు సమాచారం.