తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం యూనిట్ల పంపిణీ ప్రారంభమైంది. దళితబంధు ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారుల్లో నలుగురికి గురువారం ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో యూనిట్లను అందించారు.
ఈ నలుగురిలో ఇద్దరు ట్రాక్టర్లు, ఒకరు ట్రాన్స్‌పోర్టు, మరొకరు ట్రావెల్ వాహనాన్ని ఎంపిక చేసుకొన్నారు. దళిత బంధు యూనిట్లు గ్రౌండింగ్ కావడం సంతోషంగా ఉన్నదని మంత్రి కొప్పుల ఈ సందర్భంగా హర్షం వ్యక్తంచేశారు.
పైలట్ ప్రాజెక్టు కింద ఇప్పటికే 2000 కోట్ల రూపాయలు కరీంనగర్ కలెక్టర్ దళిత బంధు ఖాతాలో జమయ్యాయని, దీనిని బట్టి కార్యక్రమం అమలు కోసం ప్రభుత్వం ఎంత నిబద్ధతతో పనిచేస్త్తున్నదో స్పష్టమవుతున్నదన్నారు. గురువారం నాటికే సుమారు 15 వేల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఇవ్వడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఇది రోజువారీ జరిగే కార్యక్రమమని చెప్పారు. దళితబంధు ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందుతామన్న నమ్మకం, ధైర్యం దళితుల్లో కనబడిందని పేర్కొన్నారు.