‘బీజేపీ కలర్ మారింది. కొత్త కలరేసుకుని వచ్చిన్రు. ఇంటింటికీ తిరుగుతన్రు. నాైల్గెదు కార్లేసుకుని ఊళ్లకత్తే ఊకుంటమా ఏంది? తప్పుడు ప్రచారాలను అడ్డుకుంటం. అడ్డుకున్నం. ఎల్లగొట్టినం’.. హుజూరాబాద్‌లో రంగుమార్చిన బీజేపీ రాజకీయంపై స్థానిక దళితుల్లో పెల్లుబికిన ఆగ్రహం ఇది. తనది ఎర్రరంగు సిద్ధాంతమని చెప్పి.. కాషాయ రంగు పార్టీలో చేరిన ఈటల నీలిరంగు ప్రచార వాహనాలను గ్రామాలకు పంపించడంపై ప్రజలు తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు.
నీలిరంగు వాహనం.. దానిపై మోదీ సహా బీజేపీ నేతలెవరి ఫొటోలు లేకుండా.. ఫూలే, అంబేద్కర్, జగ్జీవన్‌రాం బొమ్మలతో.. తెల్లరంగు కమలం గుర్తు.. ఈటల బొమ్మతో తయారుచేసిన నాలుగైదు ప్రచార రథాలను ఈటల రాజేందర్ గ్రామాలకు పంపించారు.
ఆ రథాలను చూసి దళితబిడ్డలు ఆశ్చర్యపోయారు. దళితబంధు నలుగురైదుగురికే వస్తుందని, మిగతావారికి రాదంటూ అసత్య ప్రచారాలు చేస్తున్న ఈటల అనుచర గణానికి గుణపాఠం చెప్పారు. రంగులు మార్చిన ఈటలపై తిరగబడ్డారు. సున్నితమైన అంశాలపై రెచ్చగొడుతూ.. ఇంటింటా తిరుగుతున్న వ్యక్తులను నిలదీశారు. తప్పుడు ప్రచారాన్ని వెంటనే ఆపాలని, గ్రామం విడిచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. నాలుగు కార్లు, ప్రచార రథాన్ని వెనక్కి పంపించారు.